ప్రస్తుత బెంగుళూరు జట్టు కూర్పుపై స్పందించాడు కోచ్ సైమన్ కటిచ్. ప్రస్తుత సీజన్ కోసం 2020 నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపాడు. 13వ సీజన్ ముగిసిన వెంటనే దేశీయ టోర్నీలపై, సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. అందుకే మినీ వేలంలో ఎక్కువ మంది భారత క్రికెటర్ల కొనుగోలుకు అవకాశం లభించిందని పేర్కొన్నాడు.
"2020 ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే చాలా విషయాలపై సమీక్షించాం. సీజన్ మొత్తం ఎలా ఆడామనే అంశాలను సరిచూసుకున్నాం. ఇంకా ఏయే అంశాలలో మెరుగుపడాలన్న దానిపై దృష్టి సారించాం. ప్రస్తుత సీజన్ కోసం మాక్ వేలాన్ని కూడా నిర్వహించి.. అందుకు తగ్గట్లు సిద్ధమయ్యాం" అని చెప్పిన కటిచ్ వీడియోను ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
"దేవ్‌దత్ ఫడిక్కల్ తెలివైన వాడు. ఆడుతున్న తొలి సీజన్ (2020)లోనే ఆకట్టుకున్నాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయాడు. 473 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం అతడు టీమ్ఇండియాకు టెస్టుల్లో, టీ20ల్లో ఆడుతున్నాడు. సిరాజ్, సైని బంతితో రాణిస్తున్నారు" అని కటిచ్ పేర్కొన్నాడు.