ఆస్ట్రేలియా పర్యటనలో సారథిగా అదరగొట్టాడు అజింక్య రహానె. నాయకుడిగా జట్టును నడిపించి చారిత్రక విజయం అందించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో విరాట్ వెనుకే ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడు. హోరాహోరీగా జరగబోయే టోర్నీలో సారథికి అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 5న ఇంగ్లిష్ జట్టుతో తొలి టెస్టులో టీమ్‌ఇండియా తలపడుతుంది.
"విరాట్‌కు వెనుక నుంచి అండగా నిలవడమే నా బాధ్యత. కెప్టెన్ మెదడులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటిని అంచనా వేసి అందులో ఏమైనా మార్పులు అవసరమా లేదంటే సూచనలు ఇవ్వడమా అనేది వైస్‌కెప్టెన్ బాధ్యత. కాబట్టి నా పని చాలా తేలికగా ఉంటుంది. నేనెప్పుడు వైస్‌కెప్టెన్‌గా అతడి వెనుక ఉండాలనే అనుకుంటాను. కోహ్లీ ఏదైనా అడిగితే చెబుతాను." అని రహానె అన్నాడు.
ఆస్ట్రేలియాపై విజయం ప్రత్యేకమైనదని చెప్పిన రహానె.. అది గతం అని అన్నాడు. తమ దృష్టంతా ఇంగ్లాండ్‌తో జరగబోయే తొలి టెస్టుపై ఉందని అన్నాడు. "ఇకపై ఇంగ్లాండ్‌తో టెస్టుసిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడతాం. ఒక్కో మ్యాచును లక్ష్యం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రస్తుతం టీమ్ఇండియా లక్ష్యం చెన్నైలో ఆడే తొలి టెస్టు మాత్రమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇంకా 3-4 నెలల సమయం ఉంది. గత కొంతకాలంగా టెస్టుల్లో న్యూజిలాండ్ చాలా బాగా ఆడుతోంది. ఫైనల్‌కు చేరేందుకు ఆ జట్టుకు పూర్తి అర్హత ఉంది. మేము ఈ టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి అతిగా ఆలోచించడం లేదు." అని రహానె వెల్లడించాడు.