ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఇప్పటి వరకు ప్రత్యేక స్థానంలో నిలుస్తూ వచ్చిన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్. లీగ్‌లో అత్యుత్తమ రెండో జట్టు ఇదే. అందుకు ప్రధాన కారణం కెప్టెన్ ఎంఎస్ ధోనీ. తన చతురతతో ఇప్పటివరకు మూడు సార్లు విజేతగా నిలిపాడు. అయితే, సీఎస్కే జట్టుకు కెప్టెన్‌గా ధోనీ తొలి ఎంపిక కాదట. 2008లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు సారథిగా వీరేంద్ర సెహ్వాగ్‌ను అనుకున్నట్లు ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఎస్. బద్రీనాథ్ తెలిపాడు. ఆదివారం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
"2008లో చెన్నై సూపర్‌కింగ్స్ సారథిగా తొలి ప్రాధాన్యం ఎంఎస్ ధోనీ కాదు. నిజానికి వారు వీరేంద్ర సెహ్వాగ్‌కు నాయకత్వం అప్పగించాలని భావించారు. ఈ విషయంపై అతడిని సంప్రదించారు. దిల్లీలోనే పుట్టి పెరగడం, అనుబంధం ఉండటం వల్ల అదే నగరానికి ఆడతానని వీరూ చెప్పాడు. అతడి అభిప్రాయంతో సీఎస్‌కే అంగీకరించింది. దాంతో సారథ్యానికి ఆటగాడు ఎవరా అని ఆలోచించింది. 2007 టీ20 ప్రపంచకప్‌ను అందించిన ధోనీని రూ.6 కోట్లు పెట్టి తీసుకుంది."