తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​కు మళ్లీ గుండెకోత.. నాలుగో టీ20లో భారత్​ గెలుపు - భారత్​Xన్యూజిలాండ్​

వెల్లింగ్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన నాలుగో టీ20లో భారత్​ విజయం సాధించింది. మరోసారి సూపర్​ ఓవర్​కు​ దారి తీసిన ఈ మ్యాచ్​లో కివీస్​ ఇచ్చిన 14 పరుగుల లక్ష్యాన్ని భారత్​ ఛేదించింది. కేఎల్​ రాహుల్​ ఒక సిక్స్​, ఫోర్​ కొట్టగా.. కెప్టెన్​ కోహ్లీ బౌండరీతో మ్యాచ్​ను ముగించాడు.

New Zealand vs India, 4th T20I
కివీస్​కు మరోసారి గుండెకోత... నాలుగో టీ20లో భారత్​ విజయం

By

Published : Jan 31, 2020, 5:09 PM IST

Updated : Feb 28, 2020, 4:26 PM IST

భారత్-న్యూజిలాండ్​ నాలుగో టీ20.. టై అవడం వల్ల సూపర్​ ఓవర్​ నిర్వహించారు. ఇందులోనూ మరోసారి పరాజయం చెందింది కివీస్​ జట్టు. సూపర్​ ఓవర్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన బ్లాక్ క్యాప్స్​ 6 బంతుల్లో 13 రన్స్​ చేసింది. సీఫెర్ట్​(8), మున్రో(5) రన్స్​ చేశారు. లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు కోహ్లీ, రాహుల్​ బరిలోకి దిగారు. సౌథీ బౌలింగ్​ వేయగా.. రాహుల్​(10), కోహ్లీ (6*), సంజు శాంసన్​(0*) మరో బంతి ఉండగానే మ్యాచ్​ను ముగించేశారు.

మొదట బ్యాటింగ్​ చేసిన టీమిండియా.. మనీష్‌ పాండే (50*), రాహుల్‌ (39) రాణించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో రెండోసారి సూపర్​ ఓవర్​ జరగడం విశేషం. ఈ తాజా విజయంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 4-0 తేడాతో ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన.

మున్రో పోరాటం..

బ్యాటింగ్​ వైఫల్యాలతో ఇబ్బందిపడుతోన్న కివీస్​ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు ఓపెనర్​ మున్రో. మరో స్టార్​ బ్యాట్స్​మన్​ గప్తిల్​ (4) పరుగులకే ఔటైనా నెమ్మదిగా ఇన్నింగ్స్​ నడిపించాడు. కీపర్​ సీఫెర్ట్​తో కలిసి ఇన్నింగ్స్​ చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మున్రో (64) అనూహ్యంగా రనౌట్​ అవడం వల్ల మ్యాచ్​ మళ్లీ గాడితప్పింది. సారథి కేన్​ విలియమ్సన్​కు గాయం కారణంగా జట్టులోకి వచ్చిన టామ్​ బ్రూస్(0)​ విఫలమయ్యాడు. సీఫెర్ట్​, టేలర్​ కలిసి ఇన్నింగ్స్​ను నడిపించారు.

సీఫెర్ట్​(57), టేలర్​(24) ఆఖర్లో ఔటయ్యారు. చివర్లో మిచెల్​(4) పెవిలియన్​ చేరాడు. ఆఖరి ఓవర్​లో శార్దూల్​ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. 7 పరుగులు చేయాల్సి ఉండగా.. రెండు వికెట్లు తీసి 6 పరుగులే ఇచ్చాడు. ఇదే ఓవర్​లో మరో ఇద్దరు రనౌట్​ అయ్యారు. మొత్తంగా భారత బౌలర్లలో శార్దూల్​ 2, బుమ్రా, చాహల్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

ఆరంభంలోనే ఎదురుదెబ్బ...

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఈ సిరీస్​లో తొలిసారి బరిలోకి దిగిన సంజు శాంసన్‌ (8) మరోసారి నిరాశపర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. అయినా రాహుల్ బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కానీ సోధి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (1), దూబే (12), సుందర్‌ (0) కూడా విఫలమవ్వడం వల్ల 88 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

ఆదుకున్న మనీష్​ పాండే..

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (20)తో కలిసి మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే యత్నంలో బెనెట్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ ఔట్‌ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అయినా మనీష్‌ తన జోరును కొనసాగించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అతడికి తోడుగా సైని (11) కూడా ఆఖర్లో బ్యాట్‌ ఝుళిపించడం వల్ల భారత్‌ 165 పరుగులు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో సోధి మూడు వికెట్లు, బెనెట్‌ రెండు వికెట్లతో సత్తా చాటారు.

Last Updated : Feb 28, 2020, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details