బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సమయపాలన పాటించడని ప్రతి మ్యాచ్లో టాస్ వేయాల్సిన సమయంలో చాలా ఆలస్యంగా వచ్చేవాడని ఇటీవల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ వా అన్నాడు. అయితే తాజాగా అతడి వ్యాఖ్యలను సమర్థించాడు ఆ జట్టు మాజీ సారథి నాసర్ హుస్సేన్. అందుకే గంగూలీ అంటే తనకు నచ్చేది కాదని తెలిపాడు. ఈ విషయాన్ని క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో వెల్లడించాడు.
"గంగూలీకి సమయపాలన లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ టాస్ కోసం ఆలస్యంగానే వచ్చేవాడు. మమ్మల్ని నిరీక్షించేలా చేసేవాడు. దీంతో నాకు అతడింటే నచ్చేది కాదు. ప్రస్తుతం దశాబ్ద కాలంగా అతడితో కామెంటరీ విభాగాన్ని పంచుకుంటున్నా. ఇందులో మాత్రం చాలా చక్కగా ఉంటాడు. మంచి మనిషి. చాలా ప్రశాంతంగా ఉంటాడు. క్రికెటర్లు ఎవరైనా ఇలానే ఉంటారేమో. మనం వారితో ఆడుతున్నప్పుడు ఇష్ట పడం. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిస్తే వారిలో మంచి కోణం కనబడుతుంది. గంగూలీ విషయంలో కూడా నాకు ఇదే జరిగింది."