లాక్‌డౌన్ సమయంలో తాము ఎక్కడ ఉన్నామో సమాచారం అందించనందుకు ఐదుగురు భారత క్రికెటర్లకు జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మకు ఉన్నారు.
ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు - nada latest news
లాక్‌డౌన్ వేళ ఎక్కడున్నారో తెలపలేదనే కారణంగా.. ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు పంపించింది. వీరిలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు.
అయితే ఈ నోటీసులపై ఆటగాళ్ల తరఫున నాడాకు వివరణ ఇచ్చింది బీసీసీఐ. సంబంధిత దరఖాస్తు ఫారానికి సంబంధించిన వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌లో సమస్య కారణంగానే వారి వివరాలు పంపడంలో ఆలస్యమైందని తెలిపింది. స్పందించిన నాడా, బీసీసీఐ వివరణ న్యాయబద్ధంగానే ఉందని, చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. లాక్‌డౌన్ అమలైన సుమారు మూడు నెలల కాలంలో జాతీయ క్రీడాకారులు తాము ఎక్కడున్నామనే విషయాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని నాడా నిబంధన విధించింది.