హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన ముంబయి ఇండియన్స్ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపుర్ వేదికగా నేడు సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో విజయం చాలా అవసరం.
ఇంతకుముందు ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది రహానే సేన. బ్యాట్స్‌మెన్‌లో బట్లర్, రాహుల్ త్రిపాఠి ఫర్వాలేదనిపిస్తుండగా మిగతావారు స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చట్లేదు. ఈ సీజన్లో తొలి సెంచరీతో మెరిసిన సంజు శాంసన్ గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయాడు. రహానే కూడా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ విఫలమవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ చివర్లో దూకుడుగా ఆడి ఆకట్టుకోగా.. టర్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా.. మిగతా వారు అంతగా రాణించట్లేదు.
హ్యాట్రిక్ విజయాలపై కన్నేసిన ముంబయి ఈ మ్యాచ్‌లో గెలవాలన్న కసితో ఉంది. ఇంతకుముందు రాజస్థాన్‌పై ఓడిన రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ జట్టుకు మంచి శుభారంభాలనిస్తున్నారు. పాండ్య సోదరులు, పొలార్డ్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది.
బౌలింగ్ విభాగంలోనూ పటిష్ఠంగా కనిపిస్తుంది ముంబయి ఇండియన్స్. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిసిన రాహుల్ చాహర్‌తో పాటు మలింగ, బుమ్రా, పాండ్య సోదరులు మరోసారి సత్తాచాటాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇరుజట్లు 22 సార్లు తలపడగా ముంబయి 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ 10 సార్లు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
జట్ల అంచనా
రాజస్థాన్ రాయల్స్
అజింక్యా రహానే (కెప్టెన్), ధవళ్ కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ, బట్లర్, జయదేవ్ ఉనద్కట్, సంజు శాంసన్, ఆష్టన్ టర్నర్, ఇష్ సోధి, రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, పొలార్డ్, హార్దిక్ పాండ్య, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, బెన్ కటింగ్, లసిత్ మలింగ, బుమ్రా