టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో పాల్గొని, తద్వారా టీ20 ప్రపంచకప్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. కానీ అతడి ఆశల్ని కరోనా ఆవిరి చేసింది. వైరస్ వల్ల ఏకంగా ఈ టోర్నీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మహీ రిటైర్మెంట్ తీసుకుంటాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం అతడికి లేదన్నాడు ధోనీ స్నేహితుడు. ఇప్పటికీ మహీ.. రోజూ ప్రాక్టీసు చేస్తున్నాడని చెప్పాడు.
'రిటైర్మెంట్ గురించి అడిగితే ధోనీకి కోపమొస్తుంది' - cricket news
భారత మాజీ వికెట్ కీపర్ ధోనీ, ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోడని చెప్పాడు అతడి ఆప్తమిత్రుడు. ఈ విషయం గురించి ఎవరైనా అడిగితే మహీకి కోపమొస్తుందని అన్నాడు.
"గత కొన్ని నెలల నుంచి అతడు(ధోనీ) బాగా కష్టపడుతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా చేయడం చూడలేదు. ఐపీఎల్‌తో పాటే జట్టులోకి వచ్చేందుకు రోజూ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఎవరూ తనవెనకు లేనప్పుడే తానెంటే నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతడికి అండగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందుకే ధోనీ రీఎంట్రీ కోసం చాలా కృషి చేస్తున్నాడు. ఎవరైనా సరే రిటైర్మెంట్ గురించి అడిగితే కోపం వచ్చేస్తుంది" -ధోనీ ఆప్తమిత్రుడు
గతంలో ధోనీ గురించి మాట్లాడిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. ఐపీఎల్లో అతడి ప్రదర్శన బట్టి జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేది ఆలోచిస్తామని అన్నాడు.