బీసీసీఐ నూతన సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ.. అభ్యర్థులను ఎంపిక చేయనుంది. త్వరలోనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కీలక వ్యక్తులు ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల చీఫ్ సెలక్టర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల్లో అత్యంత సీనియర్ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, అతడి సహచరుడు గగన్ ఖోడా పదవీ కాలం ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివ రామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలక్టర్ పదవి దక్కుతుందని దాదా అన్నారట. కాగా బీసీసీఐ రాజ్యాంగంలోని 'కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి ఛైర్మన్‌గా నియామకం అవుతారు' అన్న నిబంధన సందేహాలకు తావిస్తోంది.