తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిథాలీ రాజ్​.. పరుగుల రారాణి.. లేడీ సచిన్‌.! - భారత క్రికెటర్​ మిథాలీ రాజ్​

మైదానంలో ఆమె బ్యాట్​ పడితే పరుగుల వరద.. పదేళ్లకే క్రికెట్​ బ్యాట్​ పట్టి.. వరుస విజయాలు సాధిస్తూ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. భరతనాట్యంపై మక్కువ ఉన్న ఈమె.. ఆ సాంప్రదాయ నృత్యాన్ని కూడా వదలకుండా క్రికెట్​, భరతనాట్యానికి సమపాళ్లలో న్యాయం చేసింది. ఆ అకుంఠిత కృషి ఫలితమే తాజాగా అంతర్జాతీయ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లలో పదివేల మైలు రాయిని సాధించింది. నేటి యువతకు ఆదర్శంగా నిలిచిందీ ప్రముఖ క్రికెటర్​ మిథాలీ రాజ్​..

mithali raj
మిథాలీ రాజ్

By

Published : Mar 15, 2021, 8:04 PM IST

క్రికెట్ ఆడటానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుంది మిథాలీ రాజ్​. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత 'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్

ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఈ స్టార్ క్రికెటర్.. తాజాగా మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. తన రెండు దశాబ్దాల క్రికెట్‌ కెరీర్‌లో పది వేల పరుగుల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా, అంతర్జాతీయంగా రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిందీ హైదరాబాదీ. ఇప్పటికే లేడీ సచిన్‌గా మన్ననలందుకుంటోన్న ఈ క్రికెట్‌ క్వీన్‌ తాజా రికార్డుతో మరోసారి తనకెదురులేదనిపించింది. ఈ నేపథ్యంలో అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా తనకెదురైన ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకుంటూ, ఒక్కో మెట్టూ ఎక్కుతూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లోని కొన్ని మలుపుల్ని ఓసారి నెమరువేసుకుందాం..

సచిన్​ ప్రశంసలు

పది వేల పరుగులు.. ఆమెకే సాధ్యం!
ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు తన సొంతం చేసుకున్న ఈ క్రికెట్‌ క్వీన్‌.. ఇప్పుడు తాజాగా మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలు రాయిని దాటిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్‌గా, ప్రపంచ క్రికెట్‌లో రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిందీ హైదరాబాదీ. ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ మిథాలీ కంటే ముందు పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 36 పరుగులు చేసిన మిథాలీ ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది. మొత్తంగా వన్డేల్లో 6974, టీ20ల్లో 2364, టెస్టుల్లో 663 పరుగులతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తోందీ హైదరాబాదీ క్రికెటర్‌. ఇలా తాజాగా పదివేల పరుగులు పూర్తి చేసిన మిథాలీపై ప్రముఖుల దగ్గర్నుంచి ఫ్యాన్స్‌ దాకా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలురాయిని దాటిన మిథాలీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఇదో అత్యద్భుతమైన రికార్డు..! కీప్‌ గోయింగ్‌ స్ట్రాంగ్‌!’ అంటూ సచిన్‌ తెందూల్కర్‌ ట్విట్టర్‌ ద్వారా మిథాలీని అభినందించారు.

మహర్దశ వైపు నడిపించింది!

పరుగుల రారాణి

1999లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు అటు ఐసీసీకి, ఇటు బీసీసీఐకి మహిళల క్రికెట్‌తో సంబంధమే లేదు. స్పాన్సర్లు లేకపోవడంతో విదేశీ పర్యటనలకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడో ఆర్నెళ్లకో సిరీస్, ఏడాదికో పర్యటన అన్నట్లుగా ఉండేది మహిళల క్రికెట్ జట్టు పరిస్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దృఢచిత్తంతో నిలబడిందీ క్రికెట్ దిగ్గజం. మేటి ఇన్నింగ్స్‌లు, సరికొత్త రికార్డులతో మహిళల క్రికెట్‌కు ప్రాణం పోసింది.. సారథిగా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. ఐసీసీ ఆదేశాలతో మిగతా బోర్డులు మహిళల క్రికెట్‌ను విలీనం చేసుకున్నా.. బీసీసీఐ మాత్రం మొదట్లో అందుకు ఒప్పుకోలేదు. అయినా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలనందిస్తూ విలీనం చేయక తప్పని పరిస్థితిని కల్పించింది మిథాలీ. అలా 2006లో బీసీసీఐలో విలీనం మహిళల క్రికెట్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతో తరచూ క్రికెట్ సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్ ఫీజులు, పురుష క్రికెటర్లతో సమానంగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణాలు, సెంట్రల్ కాంట్రాక్టులతో మహిళల క్రికెట్లో మహర్దశ మొదలైంది. ఇలా మహిళల క్రికెట్‌కు ఇన్ని పేరు ప్రఖ్యాతులొచ్చాయంటే అందులో మిథాలీ పాత్ర, ఆమె ఆటతీరు, పట్టుదలే కీలకం అని చెప్పడంలో సందేహం లేదు.

ఎందరికో స్ఫూర్తిగా..

ఎందరికో స్ఫూర్తిగా..

2003లో మిథాలీ భారత జట్టు పగ్గాలు చేపట్టినప్పుడు జట్టులో అంతా ఆమె కంటే సీనియర్లే. ప్రస్తుతం జట్టులో అందరూ ఆమె కంటే జూనియర్లే. ఒకప్పుడు అస్థిత్వమే లేని అమ్మాయిల క్రికెట్ ఇప్పుడు దేశంలో మహిళల క్రీడల్లో ముందుంది. ఆదాయం, ప్రచారం, పేరులో మహిళల క్రికెట్ మంచి స్థితికి చేరుకుంది. మిథాలీ స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. స్మృతీ మంధాన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ అలా వచ్చినవాళ్లే. 2017 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనతో దేశంలో ఆటకు మరింత ఆదరణ పెరిగింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా క్రికెట్ నేర్పించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువైంది. ఇలా అమ్మాయిలందరికీ స్ఫూర్తి ప్రదాతగా మారిందీ క్రికెట్ మహారాణి.

భరతనాట్యమంటే ఎంతో ఇష్టం!

  • పదేళ్ల వయసులో మిథాలీ చాలా ఆలస్యంగా నిద్రలేచేది. ఆ బద్ధకాన్ని వదిలించాలనే ఉద్దేశంతోనే మిథాలీ తండ్రి దొరై రాజ్ సికింద్రాబాద్‌లోని ఓ స్పోర్ట్స్ అకాడమీలో ఆమెను చేర్పించారు.
  • అలా పదేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఆమెకు అంతకుముందు క్రికెటన్నా, ఇతర క్రీడాంశాలన్నా అస్సలు ఇష్టముండేది కాదట. అందరమ్మాయిల్లాగే తానూ భరతనాట్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపేదాన్నని చెబుతుందీ మేటి క్రికెటర్.
  • చిన్నతనం నుంచీ భరతనాట్యంపై విపరీతమైన ఆసక్తి కనబరిచే మిథాలీ.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ నృత్యాన్ని నేర్చుకుంది. అంతేనా.. కొన్ని స్టేజి పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చింది. ఇక తన చూపు క్రికెట్‌పైకి మళ్లిన తర్వాత కూడా తన అభిరుచిని వదల్లేదామె. కాస్త కష్టమైనా రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో నాట్యం సాధన చేస్తూ తనలోని మక్కువను చాటేదీ క్రికెటర్.
  • క్రికెట్‌లో మిథాలీ ప్రతిభను గుర్తించిన మాజీ పేసర్ జ్యోతి ప్రసాద్ ఆమెకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఆమె తల్లిదండ్రులను అతి కష్టమ్మీద ఒప్పించి మరో కోచ్ సంపత్‌కుమార్ దగ్గరికి పంపించారు. ఆమె ఆటతీరు గమనించిన సంపత్ భవిష్యత్తులో మిథాలీ మహిళల క్రికెట్లో రికార్డులు సృష్టిస్తుందని ముందుగానే వూహించారు. పదహారేళ్ల వయసు వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయిలో మిథాలీ ఆడడం చూడాలనుకొన్నారాయన. కానీ అది నెరవేరడానికి ముందే ఓ ప్రమాదంలో చనిపోయారు.

పుస్తకాలు వదలదు!

పుస్తక పఠనమంటే ఇష్టం

మిథాలీకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ప్రతి మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు పుస్తకాలు చదువుతూ వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం తనకు అలవాటు. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నమ్మే ఈ క్రికెటర్.. క్రైమ్, చరిత్ర, ఆత్మకథలు, ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ప్రముఖ పర్షియన్ కవి జలాలుద్దీన్ రూమీ రచించిన 'ది ఎసెన్షియల్ రూమీ' అనే పుస్తకాన్ని చదువుతూ మీడియా కంటికి చిక్కింది. అప్పుడు ఆ ఫొటో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

డాక్టర్‌తో పెళ్లి వద్దంది!

* మహిళా క్రికెట్​లో పెద్దగా ఆదాయం లేని రోజుల్లో వైద్యుడిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడే అవకాశం వచ్చింది మిథాలీకి. కానీ పెళ్లి తర్వాత ఆటకు దూరంగా ఉండాలని షరతు పెట్టడంతో ఆ పెళ్లి వద్దనుకుందటట. ఇలా తన ఆత్మాభిమానాన్ని, ఆటపై ప్రేమను చాటుకుందీ మేటి క్రికెటర్.
* అలాగే ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌లో మహిళా వ్యాఖ్యాత కోసం ఇంటర్వ్యూకు కూడా వెళ్లింది మిథాలీ. అన్ని పరీక్షల్లోనూ పాసైంది. కానీ మోకాళ్ల పైవరకు దుస్తులు వేసుకోవాలని చెప్పగానే ఇంటికి తిరిగొచ్చేసింది. ఇలా పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా.. ఆత్మగౌరవానికే విలువిచ్చి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకుందీ క్రికెటర్.

ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ!

మైదానంలో అడుగుపెడితే పరుగుల వరద
  1. 1999లో తన పదహారేళ్ల ప్రాయంలో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలీ.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై 114 పరుగులు చేసిన ఈ క్రికెట్ దిగ్గజం.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అంతేకాదు.. డెబ్యూ మ్యాచ్‌లోనే వందకు పైగా పరుగులు చేసిన నాలుగో మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది మిథాలీ.
  2. 2002 ప్రపంచకప్‌లో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూనే ఆ టోర్నీలో పాల్గొన్న ఈ మేటి క్రికెటర్.. ఆటపై తన అంకితభావాన్ని చాటుకుంది.
  3. 21 ఏళ్లకే భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మిథాలీ.. ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ క్రీడాకారిణిగా, మొత్తంగా ఏడో క్రీడాకారిణిగా నిలిచింది. నాటి నుంచి నేటి వరకు తన కెప్టెన్సీలో రెండుసార్లు మన మహిళల జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తన చక్కనైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్‌తో, స్టార్ ప్లేయర్‌గా ఉన్నా జట్టు సహచరులతో స్నేహభావంతో మెలుగుతూ, వారికి క్రీడా నైపుణ్యాల్ని నేర్పిస్తూ కూల్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకుందీ స్త్టెలిష్ ప్లేయర్.

మహిళల క్రికెట్లో సచిన్!

* 22 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో భాగంగా.. వన్డేల్లో 6974, టీ20ల్లో 2364, టెస్టుల్లో 663 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ క్రికెటర్‌.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో లీడింగ్‌ స్కోరర్‌గా కొనసాగుతోంది. అందుకే ఆమెను అభిమానులంతా ముద్దుగా ‘తెందూల్కర్‌ ఆఫ్‌ ఇండియన్‌ విమెన్స్‌ క్రికెట్‌’గా పిలుచుకుంటారు.
* అంతేకాదు.. మిథాలీ ఆరాధ్య క్రికెటర్ కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కరే. ఆయన ఆటతీరును, సహచరులతో మెలిగే విధానాన్ని గ్రహించిన ఈ మేటి క్రికెటర్ క్రీడా రహస్యం కూడా అదేనంటూ అభిమానులు, క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తుంటారు.
* సుమారు 22 ఏళ్ల నుంచి తన జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేసిన మిథాలీ.. ఇంతటి సుదీర్ఘ కెరీర్‌ని కొనసాగించిన తొలి మహిళా క్రికెటర్‌గానూ కీర్తి గడించింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌లో కొనసాగిన వారిలో నాలుగో స్థానంలో నిలిచిందీ క్రికెట్‌ దిగ్గజం.
* జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా, ప్లేయర్ కోచ్‌గానూ వ్యవహరించిన ఈ హైదరాబాదీ ప్లేయర్.. ఓ క్రీడాకారిణిగా, కెప్టెన్‌గానే కాదు.. కోచ్‌గానూ తన సత్తాను చాటుకుంది.

క్రికెట్​లోకి రాకపోయుంటే...

* ఒకవేళ మీరు క్రికెటర్ కాకపోయుంటే? అని అడిగితే.. 'సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి సేవ చేయడమంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. అలాగే భరతనాట్యాన్నీ ప్రేమిస్తా. నేను క్రికెట్‌లోకి రాకపోతే సివిల్ సర్వీసెస్‌లో చేరేదాన్ని. అలాగే భరత నాట్యాన్నీ కొనసాగించేదాన్ని..' అని చెబుతుందీ క్రికెట్ బ్యూటీ.
* 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు, రికార్డులు, అవార్డులు-రివార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ పవర్‌ఫుల్ క్రికెటర్.. 'విజ్డెన్ ఇండియా క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది. 2015 ఏప్రిల్‌లో ఆమె ఈ అవార్డును అందుకుంది.

ఇంతకాలం ఆడతాననుకోలేదు..

* 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన సందర్భంలో మిథాలీ మాట్లాడుతూ.. 'నా దృష్టిలో 200 ఒక సంఖ్య మాత్రమే. అయితే ఇంత దూరం ప్రయాణించడం గొప్పగా అనిపిస్తోంది. మహిళల క్రికెట్లో భిన్న దశలు చూశా. 1999లో అంతర్జాతీయ మహిళల క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వన్డేల్లో అరంగేట్రం చేశా. ఐసీసీలో విలీనమయ్యాక తేడా స్పష్టంగా చూస్తున్నాం. సుదీర్ఘకాలం పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆట మొదలుపెట్టినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని వూహించలేదు. టీమిండియాకు ఆడితే చాలనుకున్నా. జట్టులో కీలక సభ్యురాలిగా ఉండాలనుకున్నా. కానీ ఇంత సుదీర్ఘంగా ఆడతానని అనుకోలేదు..' అంటూ తన మనసులోని భావాల్ని అందరి ముందుంచుతూ తన నిరాడంబరతను చాటుకుందీ పవర్‌ఫుల్ ప్లేయర్.
* వన్డే క్రికెట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తిరుగన్నదే లేని మిథాలీకి దేశానికి ప్రపంచకప్ అందించాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే 2021 ప్రపంచకప్‌పై తన పూర్తి దృష్టి నిలపడానికి, సారథిగా దేశానికి తొలి మహిళా ప్రపంచకప్ అందించాలన్న లక్ష్యంతోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్‌ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసిందీ హైదరాబాదీ స్టార్ బ్యాటర్.
* గాయాల కారణంగా మిథాలీ పదేళ్ల క్రితమే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంది. అదే జరిగి ఉంటే ఇన్ని రికార్డులు, ఘనతలు ఆమె మిస్సవడమే కాదు.. దేశమూ అంత గొప్ప క్రీడాకారిణిని మిస్సయ్యేదేమో! ఆ కానీ ఆ సమయంలో మరింత శక్తిని కూడగట్టుకొని తాను కోల్పోయిన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి మళ్లీ తనదైన శైలిలో చెలరేగి ఆడుతోంది.

నా ఇష్టాలు ఇవీ!

* ఫేవరెట్ క్రికెటర్ - సచిన్ తెందూల్కర్, రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్
* నటుడు - షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్
* నటి - కాజోల్, అనుష్కా శర్మ
* వ్యాఖ్యాత (కామెంటేటర్) - నాజర్ హుస్సేన్
* ఆహారం - సోన్ పాపిడి
* రంగు - నలుపు
* ప్రదేశం - లండన్
* అలవాట్లు - వ్యాయామం, నాట్యం, పుస్తకాలు చదవడం
* కుటుంబ నేపథ్యం - తమిళ కుటుంబం

తనదైన కెప్టెన్సీతో భారత మహిళల క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి.. అస్థిత్వమంటూ లేని భారత మహిళల క్రికెట్‌ను శిఖరాగ్రాన నిలిపిన ఘనత మిథాలీకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె మహిళల క్రికెట్‌కే మహారాణి! ఇకపైనా ఆమె సారథ్యంలో జట్టు మరెన్నో విజయాలు సాధించాలని, వ్యక్తిగతంగా మరెన్నో రికార్డుల్ని సృష్టించాలని, తన ప్రపంచకప్ కల నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఈ లెజెండ్ క్రికెటర్‌కి మనమూ సెల్యూట్ చేద్దాం!

ఇదీ చదవండి:ఐదు రోజుల పాటు శాసనమండలి సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details