తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2021, 8:18 AM IST

Updated : Mar 7, 2021, 10:34 AM IST

ETV Bharat / sports

భారత్​ అక్కడ గెలిచి ఈ తరంలోనే ఉత్తమ జట్టుగా నిలుస్తుందా?

భారత్​తో నాలుగు టెస్టుల సిరీస్​ను గెలుపుతో ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు.. తర్వాత ఆడిన మూడింట పరాజయం పాలైంది. తమ బ్యాట్స్​మెన్ల వైఫల్యానికి మన పిచ్​లను విమర్శించారు ఆ దేశ క్రికెట్ మాజీలు. చివరికి నాలుగో టెస్టులో భారత లోయర్ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు కలిపి చేసిన పరుగులు కూడా చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఏం సాకులు చెబుతారో ఇంగ్లీష్​ జట్టు మద్దతుదారులు.

Michael Vaughan comments on team india
వాన్​ సవాలును భారత్ అధిగమించేనా?

మొతేరాలో మూడో టెస్టులో స్పిన్నర్ల బంతులు ఆడలేక రెండు జట్ల బ్యాట్స్​మెన్​ అల్లాడిపోవడం, మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసిపోవడం వల్ల ఇంగ్లిష్ జట్టు మద్దతుదారులు ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. కానీ ఆ మ్యాచ్​లో ఇరు జట్లకూ పిచ్​ సమానం. పైగా టాస్ గెలిచింది ఇంగ్లాండ్​. తొలి రోజు బ్యాటింగ్​కు కొంత అనుకూలంగా ఉన్న పిచ్​ మీద మొదట బ్యాటింగ్ చేసింది ఆ జట్టే. అయినా మ్యాచ్​ను భారత్​ సొంతం చేసుకుంది. చివరి టెస్టుకు అనుకున్నట్లే పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తూనే బ్యాటింగ్​కూ సహకరించేలా తయారైంది. పైగా ఇది డేనైట్ టెస్టు కాదు. ఈ మ్యాచ్​లోనూ మొదట టాస్​ ఇంగ్లాండే గెలిచింది. మొదట బ్యాటింగే చేసింది. కానీ 200 పైచిలుకు స్కోరుతో సరిపెట్టుకుంది.

ఇప్పుడేమంటారు మద్దతుదారులు?

రెండో రోజు భారత్​ బ్యాటింగ్​లో ఎంత ఇబ్బంది పడిందో అందరూ చూశారు. కానీ 146 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్​.. ఆ తర్వాత ఒత్తిడి కొనసాగించలేకపోయింది. పట్టుదలతో నిలిస్తే పిచ్​ ఎలా ఉన్నా పరుగులు సాధించొచ్చని పంత్​, సుందర్​ చాటి చెప్పారు. ఆ ఇన్నింగ్స్​లు పూర్తిగా వారి ఘనత. అవి ఇంగ్లాండ్ వైఫల్యానికి సూచికలు కూడా. మూడో రోజు ఉదయం సుందర్, అక్షర్​ ఎంత సాధికారితతో ఆడారో అందరూ చూశారు. రెండో సెషన్లో అదే పిచ్​ మీద ఇంగ్లిష్​ బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్ అయిన సుందర్, అక్షర్​ కలిపి చేసిన పరుగులు కూడా ఆ జట్టు మొత్తం కలిసి చేయలేకపోయింది. ఇక పిచ్​ను ఏమని నిందిస్తారు ఇంగ్లాండ్ మద్దతుదారులు.

ఇక సాకులేవీ?

తొలి టెస్టులో పరాభవం తర్వాత చెపాక్​లో స్పిన్​ పిచ్​ సిద్ధం చేయించుకున్న మాట వాస్తవం. కానీ 'ఆతిథ్య అనుకూలత'ను ఉపయోగించుకోవడం అన్ని జట్లూ చేసేదే. విదేశాలకు వెళ్లినప్పుడు మన జట్టును పేస్​ పిచ్​లే స్వాగతిస్తాయి కాబట్టి దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే మొతేరాలో మూడో టెస్టు మరీ రెండు రోజుల్లో ముగిసిపోవడం వల్ల విమర్శలు తప్పలేదు. అందుకు గులాబి బంతితో ఆడటం ఓ ముఖ్య కారణమన్నది విస్మరించలేని విషయం. చివరి టెస్టుతో ఆ సంగతి రుజువైంది. ఈ మ్యాచ్​లో పిచ్​ కంటే ఆటతీరే ఫలితాన్ని నిర్దేశించింది. దీంతో ఇంగ్లాండ్ సాకులు వెతకడానికి అవకాశమే లేకపోయింది.

వాన్​ సవాల్​..

అయితే ఈ మ్యాచ్​ అవ్వగానే.. ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. భారత్​ను అభినందిస్తూనే ఒక సవాల్​ విసిరాడు. ఈ ఏడాదే ఇంగ్లాండ్​ పర్యటనకు రానున్న భారత్​ అక్కడ కూడా గెలిస్తే ఈ తరంలో ఉత్తమ జట్టుగా అవతరిస్తుందన్నాడు. అక్కడి స్వింగ్ పరిస్థితుల గురించి హెచ్చరిక జారీ చేశాడు. వాన్​ అన్నాడని కాదు కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి అగ్ర జట్టును దాని సొంతగడ్డపై మట్టికరిపించిన టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​ను ఇంగ్లాండ్​లో ఓడిస్తే జట్టుకు తిరుగులేదని ఎవ్వరైనా అంగీకరిస్తారు. ​ ​

ఇదీ చదవండి:విరాట పర్వం- కివీస్​ను కొట్టి జగజ్జేతగా నిలిచేనా?

Last Updated : Mar 7, 2021, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details