తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాటి మెరుపులు: లక్ష్మణ పోరాటం, భజ్జీ మాయాజాలం

భారత్​ వేదికగా 2001లో ఆసీస్​పై జరిగిన మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ క్రికెట్​ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. వరుస విజయాలతో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఆ సిరీస్​తో కళ్లెం వేసింది టీమ్​ఇండియా. బలమైన ఆధిపత్యానికి తెర దించుతూ సొంతగడ్డపై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆ టెస్టు సిరీస్​ విశేషాలేంటో తెలుసుకుందాం.

By

Published : May 22, 2020, 7:15 AM IST

Updated : May 22, 2020, 11:53 AM IST

Memories of pepsi series 2001
లక్ష్మణ్​, హర్భజన్​ను హీరోలుగా మార్చిన సిరీస్​

పిచ్‌లు ఏవైనా, ప్రత్యర్థులెవరైనా నిర్దాక్షిణ్య ప్రదర్శనతో తిరుగులేని విజయాలు సాధిస్తూ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా ఓ వైపు!

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంతో సంక్షోభంలో కూరుకుని.. గంగూలీ నాయకత్వంలో తిరిగి గెలుపు బాట పట్టాలని పరితపిస్తున్న టీమ్‌ఇండియా మరోవైపు! ఈ రెండు జట్ల మధ్య 2001లో మూడు టెస్టుల సిరీస్‌. ఆసీస్‌ అలవోకగా పైచేయి సాధిస్తుందని అనుకున్నారంతా. కానీ అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కంగారూలకు భారత్‌ కళ్లెం వేసింది. 1969 తర్వాత తొలిసారి భారత గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గాలన్న ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఓ చారిత్రక ఇన్నింగ్స్‌... ఓ అత్యద్భుత స్పిన్‌ మాయాజాలం అందుకు కారణాలు. ఆ విశేషాలు చదివేయండి మరి!

ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌తో.. దుర్భేద్యమైన బౌలింగ్‌ దళంతో.. సిరీస్‌ విజయమే లక్ష్యంగా భారత్‌లో ఆ జట్టు అడుగుపెట్టింది. కానీ ఆ సిరీస్‌ టీమ్‌ఇండియాకు మరపురాని జ్ఞాపకాలను అందించింది. గంగూలీ నాయకత్వంలో.. బలమైన ఆసీస్‌ ఆధిపత్యానికి తెరదించుతూ భారత్‌ సొంతగడ్డపై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. భారత క్రికెట్‌ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్లోనూ ఈ సిరీస్‌ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందింది. భారత క్రికెట్‌ దశ, దిశను మార్చిన సిరీస్‌ అది. లక్ష్మణ్‌, హార్భజన్‌ల స్థాయిని ప్రపంచానికి చాటిన సిరీస్‌ అది.

కప్​ను అందుకున్న కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ

ఆసీస్‌ అనుకున్నట్లే..

సిరీస్‌ను ఆసీస్‌ అనుకున్నట్లే మొదలెట్టింది. వాంఖడేలో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తుచేసింది. వరుసగా పదహారో టెస్టు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌ ఆసీస్‌ సంపూర్ణ ఆధిపత్యానికి అద్దం పట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 176 పరుగులకే ఆలౌట్‌ చేసింది. కుంబ్లే గైర్హాజరీలో జట్టులో వచ్చిన యువ స్పిన్నర్‌ హర్భజన్‌ (4/121) ధాటికి ఆసీస్‌ ఓ దశలో 99 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో క్రీజులో అడుగుపెట్టిన గిల్‌క్రిస్ట్‌ (122) ఎదురుదాడికి దిగాడు. హేడెన్‌ (119)తో కలిసి జట్టును గట్టెక్కించడం వల్ల ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన భారత్‌ 47 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ ఒక్క వికెట్‌ కోల్పోకుండానే ఛేదించింది.

లక్ష్మణ రేఖ..

కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండో టెస్టు. ఫాలో ఆన్‌లో పడ్డా అనూహ్యంగా పుంజుకున్న టీమ్‌ ఇండియా.. అద్వితీయ పోరాటంతో అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీనాథ్‌తో పాటు కుంబ్లే లేకపోవడం వల్ల భారమంతా భజ్జీపైనే పడింది. ఆ పరిస్థితుల్లో ఆసీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు కష్టమే అనిపించింది. దానికి తగినట్లే ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో 193/1తో నిలిచి భారీ స్కోరు దిశగా సాగింది. కానీ అప్పుడే భజ్జీ మాయ మొదలైంది. అతను చివరి సెషన్‌లో అయిదు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, వార్న్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చి టెస్టుల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా అతను తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడం వల్ల ఆసీస్‌ 445 పరుగులకు ఆలౌటైంది. బదులుగా భారత్‌ పేలవ బ్యాటింగ్‌తో 171 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌లో పడింది. ఆ మాత్రం స్కోరు లక్ష్మణ్‌ (59) చలవే. అప్పటికి దాదాపు రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలుండగా... 274 పరుగుల లోటుతో భారత్‌ ఉంది. భారత్‌పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ కంగారూలకు షాకిస్తూ లక్ష్మణ్‌ కళాత్మక బ్యాటింగ్‌తో చరిత్రలో నిలిచిపోయి ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో దిగి అర్ధశతకం చేసిన అతడు ఫాలోఆన్‌లో మూడో స్థానంలో సొగసైన ఆటతీరు కొనసాగించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ప్రత్యర్థి పేసర్లు నిప్పులు చెరుగుతున్నా.. వెన్నునొప్పి బాధిస్తున్నా సహనంతో క్రీజులో నిలబడ్డాడు. ద్రవిడ్‌ (180)తో అయిదో వికెట్‌కు 376 పరుగుల భాగస్వామ్యంతో జట్టును సురక్షిత స్థానానికి చేర్చాడు. లక్ష్మణ్‌ 452 బంతుల్లో 281 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. లక్ష్మణ్‌, ద్రవిడ్‌ తెగువతో భారత్‌ 657/7 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి ముందు 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు లంచ్‌కు ముందు ఛేదన ఆరంభించిన ఆసీస్‌ను భజ్జీ (6/73) మరోసారి వణికించాడు. ప్రత్యర్థిని 212 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ 171 పరుగుల తేడాతో గెలిచింది. 16 వరుస విజయాల తర్వాత ఆసీస్‌కు తొలి ఓటమి అది.

భజ్జీ మాయ..

నిర్ణయాత్మక మూడో టెస్టు వేదిక చెపాక్‌. ఆసీస్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో ఓ దశలో 340/3తో నిలిచింది. అప్పటికే హేడెన్‌ సెంచరీ పూర్తి చేసి జోరు మీదున్నాడు. కానీ భజ్జీ (7/133) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడి స్పిన్‌ మాయాజాలానికి ఉక్కిరిబిక్కిరైన ఆసీస్‌.. వేగంగా వికెట్లు కోల్పోయి 391 పరుగులకే పరిమితమైంది. హర్భజన్‌.. హేడెన్‌ (203) వికెట్‌ సహా చివరి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత భారత్‌ బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించింది. సచిన్‌ (126) సెంచరీకి తోడు శివ్‌సుందర్‌ దాస్‌ (84), రమేశ్‌ (61), లక్ష్మణ్‌ (65), ద్రవిడ్‌ (81) రాణించడం వల్ల 501 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో భజ్జీ (8/84) విశ్వరూపం ప్రదర్శించాడు. గిర్రున తిరుగుతున్న అతడి బంతులను అర్థం చేసుకోలేకపోయిన ఆస్ట్రేలియా.. 264 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ లక్ష్యం 155 పరుగులే. కానీ తేలికైన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్‌ తడబడింది. అభిమానులను కంగారు పెట్టింది. లక్ష్మణ్‌ (66) అర్ధశతకం సాయంతో ఓ దశలో 101/2తో అలవోకగా విజయం దిశగా సాగిన ఆ జట్టు ఒక్కసారిగా కుదుపునకు లోనై 122/5కి చేరింది. ఒకే ఓవర్లో లక్ష్మణ్‌, బహుతులే పెవిలియన్‌ చేరడం వల్ల 135/7కు చేరడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. భారత ఆటగాళ్లలో ఆందోళన, ఆసీస్‌ శిబిరంలో ఆశలు కలిగాయి. ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడి తీవ్రం చేశారు. ఆ దశలో వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సమీర్‌ దిఘే (22 నాటౌట్‌) ఎదురొడ్డి నిలవడం వల్ల భారత్‌ రెండు వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచి 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.

ఇదీ చూడండి.. హార్దిక్​ జెర్సీ నంబర్​ వెనుక రహస్యమిదే!

Last Updated : May 22, 2020, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details