వివాహం ముందు రోజు కుటుంబ సభ్యులందరూ పెళ్లిపనుల్లో మునిగిపోవడం సహజం. ముఖ్యంగా వధూవరులైతే ఆ సందడిని ఆస్వాదిస్తూ.. క్షణం తీరికలేకుండా గడిపేస్తారు. కానీ మనీశ్ పాండే మాత్రం రేపు పెళ్లి అనగా.. బ్యాట్ పట్టి మైదానంలో దిగాడు. 'ముస్తాక్ అలీ' టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారథిగా కర్ణాటక జట్టును నడిపించాడు. అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సినీ నటి అశ్రిత శెట్టితో మనీశ్ వివాహం సోమవారం జరగనుంది. పెళ్లికి ఒక రోజు ముందు కూడా మనీశ్ మ్యాచ్ ఆడడం విశేషం. ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల కెప్టెన్‌గా జట్టులో స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత భుజాలకెత్తుకున్న అతను మైదానంలో దిగడం ఆటపై అతనికున్న ప్రేమను చాటుతోంది.
కర్ణాటక రికార్డు
దేశవాళీ టీ20 టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ' ట్రోఫీకి ఈ సీజన్‌లో సిసలైన ముగింపు లభించింది. హోరాహోరీగా సాగుతూ.. తీవ్ర ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక విజేతగా నిలిచింది. ఆదివారం చివరి బంతికి ఫలితం తేలిన తుదిపోరులో కర్ణాటక ఒక్క పరుగు తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. ఫలితంగా ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో తొలిసారి డిఫెండింగ్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. గతేడాది కూడా కర్ణాటక టైటిల్ నెగ్గింది.