కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన మరొకరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. అతడు బెళగావి పాంథర్స్ జట్టుకు చెందిన కోచ్ సుదీంద్ర శిందేగా తెలిపారు. ఈ లీగ్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ విషయాల్లో ఇతడిది కీలక పాత్ర అని సీసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కోచ్ ఇంటిలో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
బెళగావి ఫాంథర్స్ కోచ్ సుదీంద్ర శిందే
శిందే.. గతంలో కర్ణాటక క్రికెట్ సంఘం కార్యవర్గంలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ఆ సమయంలో చాలా మంది యువ ఆటగాళ్లను ఫిక్సింగ్‌లోకి లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో బెళగావి పాంథర్స్ జట్టు యజమాని అలీ అష్ఫాక్ థార్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బెళగావి పాంథర్స్ జట్టు యజమాని అలీ అష్ఫాక్ థార్ డొంక ఇలా కదిలింది...
బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎం గౌతమ్, అబ్రర్ ఖాజీలు కేపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కారు. బళ్లారి టస్కర్స్, హుబ్లీ టైగర్స్ జట్ల మధ్య ఆగస్టు 31న జరిగిన కేపీఎల్ ఫైనల్లో.. వీరిద్దరూ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ మ్యాచ్‌లో మెల్లగా బ్యాటింగ్ చేసేందుకు గాను రూ.20 లక్షలు తీసుకున్నారని.. అలాగే బెంగళూరుతో జరిగిన మరో మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని వెల్లడించారు.
గౌతమ్ కర్ణాటక, గోవా జట్లతో పాటు ఇండియా- ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లకు ఆడిన అనుభవం ఉంది. అబ్రర్ ఖాజీ కర్ణాటక జట్టుకు ఆడాడు. వీరితో పాటు హరియాణాకు చెందిన సయ్యమ్ అనే అంతర్జాతీయ బుకీని, నిషాంత్ సింగ్ షెఖావత్ అనే క్రికెటర్‌నూ అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు. నిషాంత్ బుకీలతో సంబంధాలు కలిగి ఉండడమే కాకుండా బెంగళూరు బ్లాస్టర్స్ బౌలింగ్ కోచ్ విను ప్రసాద్‌ను ఫిక్సింగ్ విషయంపై సంప్రదించినట్లు అధికారులు వెల్లడించారు.