ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌పై మెల్లమెల్లగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి! కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లీగ్‌ను వాయిదా వేయాలని ఇటీవలె మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె.. బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు వ్యతిరేకత తెలిపినట్లు సమాచారం.
"ఐపీఎల్ నిర్వహించలేం".. కేంద్రానికి కర్ణాటక లేఖ! - Karnataka writes a letter to central government regarding ipl
ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఓవైపు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల టోర్నీ వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లీగ్ నిర్వహించేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్లు సమాచారం.
లేఖపై వార్తలు..
ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదాపై ఎలాంటి వార్తలు రాలేదు గానీ బెంగళూరులో నిర్వహించకపోవచ్చని తెలుస్తోంది. బెంగళూరులోని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వార్త ప్రకారం.. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా వేయాలని లేదా నిర్వహించొద్దని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందట. బెంగళూరులో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ లేఖనూ రాసినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతమైదానం చిన్నస్వామి. ఈ వార్తల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.