వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్‌లో ధోనీ రెచ్చిపోతాడని టీమ్‌ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఎంతో మంది ఆటగాళ్లు ఆడతారని, ముఖ్యంగా బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ బాగా ఆడతాడని, దాన్ని అతడు ఆస్వాదిస్తాడని చెప్పాడు. ఇప్పుడు రిటైరైన నేపథ్యంలో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
బౌలర్లు కాస్త జాగ్రత్త.. ధోనీ రెచ్చిపోతాడేమో! - ధోనీ ఐపీఎల్
ఈసారి ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రెచ్చిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. ముఖ్యంగా బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు.
అలాగే తనలాంటి రిటైరైన బౌలర్లు సంతోషంగా ఉంటామని సరదాగా అన్నాడు ఇర్ఫాన్. ఎందుకంటే తాము సీఎస్కే కెప్టెన్‌కు బంతులు వేసే అవకాశం లేకుండా తప్పించుకున్నామని జోక్ చేశాడు. ఈ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని, ఆ టోర్నీలో ఆడే బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు.
లాక్‌డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్.. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగబోతుంది. ఎలాగూ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో ఇక ఐపీఎల్‌లో బ్యాట్ ఝుళిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.