తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్2020: రాజస్థాన్ రాయల్స్ బలాలు, బలహీనతలు ఇవే! - రాజస్థాన్ రాయల్స్ బలాలు

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగబోతుంది. ఈ మెగా లీగ్ కోసం ఇప్పటికే జట్లన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ టోర్నీ ప్రారంభ సీజన్​లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో నిలిచింది. మరి ఈసారైనా ఈ జట్టును అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. ఐపీఎల్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

IPL202
ఐపీఎల్2020

By

Published : Sep 13, 2020, 6:31 PM IST

ఐపీఎల్ ప్రారంభ సీజన్​లో అండర్​డాగ్స్​గా బరిలోకి దిగి టైటిల్ విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత నిలకడలేమితో ప్రతి సీజన్​లోనూ నిరూత్సాహపర్చింది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని కొత్త లుక్​తో సిద్ధమైంది. ఈసారి యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. మరి ఈసారైనా ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందా? ఈ సీజన్​లో రాయల్స్ బాలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.

ఆర్ఆర్ షెడ్యూల్

బలాలు

రాజస్థాన్‌ బలం ఆ జట్టు టాపార్డర్. మ్యాచ్‌ ఫలితాలను ఒంటిచేత్తో తారుమారు చేయగల కెప్టెన్‌ స్మిత్‌తో పాటు బట్లర్‌, స్టోక్స్‌, మిల్లర్‌ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. శాంసన్‌ రూపంలో ప్రతిభావంతుడైన ఆటగాడున్నాడు. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన కుర్రాళ్లు.. యశస్వి జైస్వాల్, పేసర్‌ కార్తిక్‌ త్యాగిలతో పాటు గత సీజన్‌లో ఆకట్టుకున్న రియాన్‌ పరాగ్‌పై మంచి అంచనాలున్నాయి. రంజీల్లో అదరగొట్టిన పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌తో పాటు ఆర్చర్‌, థామస్‌లతో పేస్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్, శ్రేయాస్ గోపాల్ రూపంలో నాణ్యమైన ఆల్​రౌండర్లు ఉన్నారు. ఈసారి యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉండటం ఈ జట్టుకు పెద్ద ప్లస్.

భారతీయ ఆటగాళ్లు

బలహీనతలు

ఈసారి వేలంలో చాలామంది కొత్త ఆటగాళ్లను తీసుకున్న జట్టుకు కాంబినేషన్ల కూర్పు కాస్త ఇబ్బందే. స్వదేశీ ఆటగాళ్లకు అంతగా అనుభవం లేదు. అజింక్యా రహానే లాంటి అనుభవజ్ఞుడ్ని వదులుకుంది. ఇతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రాబిన్ ఉతప్ప లీగ్​లో అంతగా రాణించలేకపోతున్నాడు. అలాగే పేస్ బౌలింగ్​ విభాగం పేలవంగా కనిపిస్తోంది. ఎక్కువగా జోఫ్రా ఆర్చర్​పైనే ఆధారపడాల్సి ఉంటుంది. జయదేవ్ ఉనద్కత్​ గత కొన్నేళ్లుగా విఫల ప్రదర్శన చేస్తున్నాడు. ఈసారైనా ఇతడు జట్టు నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంది. అంకిత్ రాజ్​పుత్, ఒషానే థామస్, వరుణ్ అరోన్​లు మరో ఆప్షన్. ఆర్చర్​కు టామ్ కరన్​ నుంచి మద్దతు లభిస్తే ఈ విభాగంలో సత్తాచాటవచ్చు.

విదేశీ ఆటగాళ్లు

అవకాశాలు

ఎంతో అనుభవమున్న స్టీవ్ స్మిత్​ జట్టును ఈసారి ముందుండి నడిపించబోతున్నాడు. ఈ సీజన్​లో కూడా రాజస్థాన్ ఫేవరేట్​ ఏమీ కాదు. ప్రారంభ సీజన్​లో ఎలా అయితే అండర్​డాగ్స్​లో బరిలో దిగిందో ఈసారి అలాగే ఉంది. అప్పటిలాగే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి టైటిల్ కొట్టాలని అనుకుంటోంది. రియాన్ పరాగ్, రాబిన్ ఉతప్ప, డేవిడ్ మిల్లర్, జోఫ్రా ఆర్చర్ రాణిస్తే జట్టుకు తిరుగుండదు. వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్​లు ఉన్న దృష్ట్యా యువకులు టీమ్​ఇండియాలో చోటు కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అంకిత్ రాజ్​పుత్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, మయాంక్ మార్కండే ఈ సీజన్​లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు.

ఆర్ఆర్ కొత్త ఆటగాళ్లు

ప్రమాదాలు

ఆల్​రౌండర్ల విభాగంలో బెన్​ స్టోక్స్ ఒక్కడే గొప్పగా కనబడుతున్నాడు. కానీ ఇతడు ఈ సీజన్​లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇతడితో పాటు శ్రేయస్ గోపాల్ రూపంలో మరో ఆల్​రౌండర్ ఉన్నాడు. గత సీజన్​లో ఈ జట్టు తరఫున లీడింగ్ వికెట్ టేకర్​గా నిలిచిన శ్రేయస్..​ బ్యాటింగ్​లో మాత్రం విఫలమయ్యాడు. వీరితో పాటు అనిరుద్ధ్ జోషి, మహిపాల్ లోమ్రార్, టామ్ కురాన్, యశస్వి జైస్వాల్​ రాణించాలని జట్టు భావిస్తోంది. వీరిలో కొందరికి దేశవాళీల్లో మంచి రికార్డు ఉంది. కానీ వీరితోనే ఆల్​రౌండ్ డిపార్ట్​మెంట్ బలంగా ఉందని చెప్పలేం. పార్ట్​టైమ్ స్పిన్నర్ లేకపోవడం మరో లోపం. మయాంక్ మార్కండే ఇందుకు ఓ ఆప్షన్​గా కనబడుతున్నా.. ఇతడు ఏ మాత్రం రాణిస్తాడన్నది ప్రశ్నే.

కొసమెరుపు

తొలి సీజన్లో విజేతగా నిలిచాక మరో మూడు సార్లు (2013, 2015, 2018) ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ రాయల్స్.. గతేడాది కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి విదేశీ స్టార్లకు తోడు ప్రతిభావంతులైన భారత కుర్రాళ్లతో జట్టు బాగానే కనిపిస్తోంది. మరి ఈసారైనా టైటిల్ గెలుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details