ఐపీఎల్ అనేది చిత్రమైన టోర్నీ అని.. తనదైన రోజున ఎలాంటి జట్టయినా విజయం సాధిస్తుందని అన్నాడు ముంబయి సారథి రోహిత్ శర్మ. రెండో అర్ధభాగంలో పుంజుకోవడం తమకు అలవాటని.. కానీ ఈ సీజన్లో మొదటి నుంచి మంచి ప్రదర్శన కనబర్చామని చెప్పాడు. అగ్రస్థానంతో లీగ్ దశను ముగించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది ముంబయి. జట్టు సమష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు రోహిత్. పిచ్‌ను సద్వినియోగం చేసుకుని బౌలర్లు రాణించారని అన్నాడు. ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడి గెలవడంపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించాడు.