ఐపీఎల్.. ప్రపంచంలోనే బహుళ ప్రజాదరణ పొందిన లీగ్ సహా అత్యధిక ధనిక లీగుల్లో ఒకటి. ఈ మెగాటోర్నీ కోసం కోట్ల మంది అభిమానులు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఇందులోని జట్లకు సారథిగా వ్యవహరించడమంటే ఎంతో బాధ్యత, ఒత్తిడితో కూడిన విషయం.
ఇప్పటివరకు 12 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ టోర్నీలో.. కెప్టెన్లుగా బాధ్యతలు స్వీకరించిన కొంతమంది ఆటగాళ్లు.. జట్టును విజయపథం వైపు నడిపించి తమ సత్తా చాటారు. అయితే ఈ సీజన్ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మెగాలీగ్‌లో పాల్గొంటున్న జట్లను నడిపిస్తున్న రథ సారుథుల రికార్డులను పరిశీలిద్దాం.
మహేంద్రసింగ్ ధోనీ(సీఎస్కే)
మహేంద్రసింగ్ ధోనీ.. ప్రశాంత స్వభావంతో ప్రపంచ క్రికెట్లో విజయవంతమైన సారథుల్లో ఒకరిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన 12 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
మొత్తంగా ఈ మెగాటోర్నీ కెరీర్లో ఏ ఆటగాడు సాధించని ఘనతను ఇతడు దక్కించుకున్నాడు. 174 మ్యాచులకు సారథిగా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. వీటిలో తన వ్యూహాత్మక ఆటతో 104 మ్యాచులు గెలవగా.. 69 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాడు. బలమైన సారథిగా 60.11 విజయశాతం సాధించిన మహీ.. తన కెప్టెన్సీలో సీఎస్కేకు మూడు టైటిల్స్ అందించాడు. అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సొంతం చేసుకున్న సారథుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ(ఆర్సీబీ)
టీమ్ఇండియా సారథి కోహ్లీ.. తనదైన దూకుడుడైన ఆటతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తాడు. గత తొమ్మిది సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తూ.. జట్టు బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు తన జట్టుకు ఒక్క ట్రోఫీ అందించలేకపోయాడు. దీనిపై తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ ఫ్రాంఛైజీ ఇతడిపై నమ్మకం ఉంచి సారథ్య బాధ్యతలు ఇతడికే అప్పగిస్తూ వస్తోంది.
మొత్తంగా ఈ మెగాటోర్నీ కెరీర్లో 110 మ్యాచులకు సారథిగా వ్యవహరించి.. 49 సార్లు గెలిచి, 55 సార్లు ఓడాడు. రెండు 'టై' కాగా మరో నాలుగింటిలో ఫలితాలు తేలలేదు. విజయశాతం 47.16గా ఉంది.
రోహిత్ శర్మ(ముంబయి ఇండియన్స్)
రోహిత్ శర్మ.. ఇతడి ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల కొద్ది రన్నులు బాదేస్తాడు. అలవోకగా సిక్సర్ల మోత మోగిస్తాడు. అలాంటి ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. 2013లో ముంబయి ఇండియన్స్‌కు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అనంతర కాలంలో జట్టును నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. అత్యధిక టైటిల్స్ సాధించిన జాబితాలో.. ముంబయి జట్టును అగ్రస్థానంలో ఉంచాడు. మొత్తంగా 104 మ్యాచులకు కెప్టెన్సీ చేసి.. 60 సార్లు విజయం, 42 సార్లు ఓటమిని జట్టుకు అందించాడు. ఇతడి విజయశాతం 58.65గా ఉంది.