పానీపూరీ అమ్మిన యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్.. నేడు జరిగిన ఐపీఎల్ 2020 వేలంలో కోటీశ్వరుడయ్యాడు. ముంబయి జట్టు తరఫున ఆడుతున్న 17 ఏళ్ల యశస్వి... దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి ఇటీవల వార్తల్లో నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
వేలం ముందువరకు యశస్విపై భారీ ఆశలు పెట్టుకోగా.. అవి నిజమయ్యాయి. ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. చివరికి రాజస్థాన్ రూ.2.40 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. కనీస ధర రూ.20 లక్షలుగా ఉన్న ఈ యువ ఆటగాడు ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. ఆశయమే అనుక్షణం...
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కోరికతో ముంబయికి చేరుకున్నాడు. ఉండడానికి చోటు లేక ఒక టెంట్‌లో మూడేళ్లు గడిపాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల బతకడానికి అనేక పనులు చేశాడు. ఆజాద్ మైదానం చుట్టుపక్కల పానీపూరీ, పండ్లు అమ్మేవాడు. ఈ క్రమంలో అదే మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకున్నాడు.
ట్రాక్ రికార్డు...
2015లో పాఠశాల స్థాయిలో జరిగిన గైల్స్ షీల్డ్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు 391 చేశాడు. ఆ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు 13/99 నమోదు చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ద్విశతకం బాది సంచలనం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన యువ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. 17 ఏళ్ల 292 రోజుల వయసులోనే ఇతడు ఈ ఘనత సాధించాడు. 21వ శతాబ్దంలో పుట్టిన ఆటగాళ్లను చూస్తే ఫస్ట్‌క్లాస్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు యశస్వి కావడం విశేషం. 112.80 సగటుతో ఈ టోర్నీలో మొత్తం 564 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.