టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ కత్తిమీద సాములాంటిది. క్షణాల్లో ఫలితం మారిపోయే ఈ పొట్టి ఫార్మాట్లో తీసుకునే నిర్ణయాల్లో తడబాటు కనిపించకూడదు. ఐపీఎల్ సారథులకు ఒత్తిడి సమయంలోనూ మెదడుకు పనిచెప్పే నేర్పరితనం ఉండాలి. అందుకే ఎవరైతే ప్రశాంతంగా ఉండి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారో వారి జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. లీగ్‌లో ఇప్పటివరకు కొందరు మాత్రమే కెప్టెన్సీలో విజయవంతమయ్యారు. కొందరు తక్కువ కాలానికే ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు (కనీసం 10 మ్యాచ్‌లకు సారథిగా చేసినవారు) ఎవరో చూద్దాం.
రోహిత్ శర్మ (60.34)
ముంబయి ఇండియన్స్‌కు 8 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. జట్టును 5 సార్లు విజేతగా నిలిపాడు. ప్రతి సీజన్లోనూ తన కెప్టెన్సీతో ఆకట్టుకునే ఇతడిని ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్ అనడంలో సందేహం లేదు. జట్టుకు సారథిగా చేసిన మ్యాచ్ల్లో 60 శాతం విజయాలతో దూసుకెళ్తున్నాడు హిట్‌మ్యాన్. మొత్తంగా ఇప్పటివరకు 116 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్ 70 మ్యాచ్ల్లో విజయాన్నందించాడు. ఇతడి సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో విజేతగా నిలిచింది ముంబయి.
స్టీవ్ స్మిత్ (59.52)
టీ20 లీగ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్‌గా తన సత్తా నిరూపించుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్. 2017లో పుణె వారియర్స్‌కు ఆడిన సమయంలో ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న ఇతడు జట్టును అద్భుతంగా నడిపించాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్కూ పలు సీజన్లలో కెప్టెన్‌గా చేశాడు. మొత్తంగా ఐపీఎల్లో 42 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన స్మిత్ 25 మ్యాచ్ల్లో జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. ఇతడి విజయ శాతం 59.52గా ఉంది.