ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభ వేడుకలు టోర్నీకే ప్రత్యేక ఆకర్షణ. నెలన్నర రోజులు జరిగే ఈ మెగా టోర్నీ ... సెలబ్రిటీల ఆటపాటలు, మిరుమిట్లు గొలిపే కాంతులు, వీక్షకుల సమక్షంలో ఘనంగా మొదలవుతుంది. ఈ ఆరంభ వేడుకల వల్లే ఐపీఎల్ మరింత మందిని ఆకర్షించగలిగింది. గతేడాది లాగే వచ్చే ఏడాది... ఆ సందడి కనిపించకపోవచ్చు. బీసీసీఐ.. ఈ ఆరంభ వేడుకలను రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పూల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్ ఆరంభ వేడుకలను రద్దు చేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఆ కార్యక్రమానికి కేటాయించిన డబ్బును... అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించారు.
డబ్బు ఆదా కోసమే...
ఖర్చు తగ్గించుకునేందుకే వచ్చే ఏడాది నుంచి ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ ప్రతి ఏటా సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తోందట.
ఈ వేదికపై అంతర్జాతీయ గాయకులు, బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు ప్రదర్శనలు ఇస్తారు. మిరుమిట్లు గొలిపే లేజర్ కాంతులతో మైదానం అలంకరిస్తారు. ఇవన్నీ కలిపి భారీగా ఖర్చువుతుందనే ఐపీఎల్ పాలకమండలి తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలు బుధవారం.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో మాజీ క్రికెటర్ బ్రిజేష్ పాటిల్ అధ్యక్షతన ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరంభ వేడుకల గురించి చర్చించారు. దీని వల్ల 'డబ్బు వృథా' అని బోర్డు సభ్యులు భావించినట్లు సమాచారం.
భలే నిర్ణయాలు..
ప్రంట్ ఫుట్, హైట్ నోబాల్స్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక అంపైర్‌ను నియమించేందుకు ఒప్పుకుంది ఐపీఎల్ పాలకమండలి. ఈ సరికొత్త పద్ధతిని జాతీయ టీ20 టోర్నీ.. ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేనందున 'పవర్ ప్లేయర్'ను ఈ సీజన్‌లో అమలు చేయడం కుదరదని పాలకమండలి తేల్చి చెప్పింది.
వచ్చే నెల 18న ఐపీఎల్ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.