ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 కోసం వేలంపాటలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా సిద్ధమైపోయింది. ఈ నెల 19న కోల్‌కతా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు మొత్తం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా.. 332 మందికి మాత్రమే తుది జాబితాలో చోటు దక్కింది. ఈ లిస్ట్‌ను 8 ఫ్రాంచైజీలకు పంపింది టోర్నీ యాజమాన్యం. ఈ కార్యక్రమం అదే రోజు మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
24 మంది కొత్తవాళ్లు..
ఈ ఏడాది భారత్‌కు చెందిన 24 మంది నయా ప్లేయర్లు వేలం బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆడిన 19 మంది మళ్లీ వేలానికి వస్తున్నారు. ఫలితంగా వీరి సంఖ్య 43కు చేరింది. ఈసారి భారీ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇందులో నుంచి అన్ని ఫ్రాంచైజీలు కలిపి గరిష్ఠంగా 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 29 మంది విదేశీయులు ఉంటారు.
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో ఎంతో మంది యువ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఈసారి ఏ క్రికెటర్‌పై ఎక్కువ మొత్తం పలుకుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
వెస్టిండీస్‌కు చెందిన పేసర్ కెస్రిక్ విలియమ్స్, బంగ్లాదేశ్ సారథి ముష్ఫికర్ రహీమ్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, 21 ఏళ్ల సర్రే ప్లేయర్ విల్ జాక్స్ ఈసారి పోటీలోకి వస్తున్నారు. వీరితో పాటు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ లిన్, జాసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మాథ్యూస్, హెజిల్‌వుడ్, స్టెయిన్, ముస్తాఫిజుర్ రెహ్మన్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లాలు ఎక్కువ ధర అందుకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.