యూఏఈ వేదికగా మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం యూఏఈ వెళ్లిన 20 మంది అధికారులకు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. ఇందులో మొత్తం 12 మంది భారతీయ అంపైర్లు ఉండగా.. ముగ్గురు విదేశీ అంపైర్లు, ఐదుగురు భారతీయ మ్యాచ్ రిఫరీలు ఇటీవలే వారి నిర్బంధాన్ని పూర్తి చేసుకున్నారు. వైరస్ లక్షణాలు కనిపించకపోవడం వల్ల వారందరూ ఐపీఎల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అంపైర్ల బృందంలో ప్రతి ఒక్కరిని ఆరు రోజుల నిర్బంధంలో ఉంచి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. చేసిన ప్రతిసారి వారికి వైరస్ సోకలేదని నిర్ధరణ అయినట్లు బీసీసీఐకి చెందిన అధికారి వెల్లడించారు. చెన్నై సూపర్‌కింగ్స్ శిబిరంలో 13 మంది సభ్యులకు కరోనా సోకిన తర్వాత బీసీసీఐ ఆందోళనలో పడింది. అంపైర్లకు చేసిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాచ్ రిఫరీలకు దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యాక ఒకసారి, హోటళ్లలో మూడు సార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. 20 మంది సభ్యుల్లో ఒక బృందం అబుదాబిలో, మరొక బృందం దుబాయ్‌లోని హోటళ్లలో ఉంటున్నారు.
"దుబాయ్, షార్జాలతో పోలిస్తే అబుదాబిలో కొవిడ్-19 నిబంధనలు కఠినంగా ఉన్నాయి. కొంతమంది అంపైర్ల, రిఫరీల బృందం టోర్నీ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటుంది. దుబాయ్, షార్జా మధ్య ప్రయాణ పరిమితులు లేనందున ఈ రెండు ప్రాంతాల్లో మ్యాచ్‌లకు దుబాయ్‌లోని అంపైర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇది మిక్స్-అండ్-మ్యాచ్ పాలసీ అవుతుంది" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.