తెలంగాణ

telangana

ETV Bharat / sports

మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా? - ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరా అవతరించింది. ఈ నేపథ్యంలో మొతేరా స్టేడియం సామర్థ్యం, ప్రత్యేకతలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం.

Interesting facts about worlds largest cricket stadium
మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?

By

Published : Feb 24, 2021, 10:02 AM IST

Updated : Feb 24, 2021, 12:03 PM IST

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్‌, మెల్‌బోర్న్‌ లాంటి స్టేడియాలు క్రికెట్‌ అభిమానులను ఆకర్షిస్తుంటాయి. భారత్‌ విషయానికొస్తే.. ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడె లాంటి స్టేడియాలకు ఉన్న ఖ్యాతే వేరు. ఐకానిక్‌ స్టేడియాలుగా పేరున్న ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడటం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడాలని కోరుకుంటారు. అయితే ఇకపై ప్రతి భారత అభిమానీ తప్పక ఓ మ్యాచ్‌ చూడాలని కలలు కనే స్టేడియంగా మొతేరా మారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. మనం లార్డ్స్‌ లాంటి స్టేడియాల గురించి మాట్లాడుకున్నట్లే ఇక నుంచి ప్రపంచం ఈ మైదానం గురించి గొప్పగా చర్చించుకోబోతుందంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం.

మొతేరాపై ఈటీవీ భారత్ విశ్లేషణ

సామర్థ్యం ఎంతంటే?

1,00,024 సామర్థ్యంతో ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టింది మొతేరా. లక్షా పది వేల సామర్థ్యమున్న ఈ మైదానం కోసం దాదాపు రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. క్రికెట్‌ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలు తీసుకుంటే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మే డే స్టేడియం తర్వాతి స్థానం మొతేరాదే. ఇంతకుముందు ఇక్కడున్న పాత స్టేడియాన్ని పునర్నిర్మించి ఇంత భారీగా తీర్చిదిద్దారు. ఇక్కడ తొలి మ్యాచే గులాబీ బంతితో జరగబోతుండటం విశేషం. ఈ నెల 24 నుంచి 28 వరకు భారత్‌-ఇంగ్లాండ్‌ డేనైట్‌ టెస్టుకు మొతేరా ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు, ఆ తర్వాత అయిదు టీ20లకు కూడా మొతేరానే ఆతిథ్యమిస్తుంది. అంటే వచ్చే నెల రోజులు ఇక్కడ సందడే సందడన్న మాట!

ప్రధాని కలల స్టేడియం

మొతేరా స్టేడియానికి 'సర్దార్​ పటేల్​ గుజరాత్​ స్టేడియం' అని పేరు మార్చారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్​. ప్రధాని గుజరాత్​ క్రికెట్​ ఆసోసియేషన్​ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని నిర్మించాలని సంకల్పించారు.

నవీకరణ

2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 3 ప్రవేశ ద్వారాలతో 63 ఏకరాల్లో ఈ స్టేడియం ఉంది. ఇందులో ఒలింపిక్​ స్థాయి ఈత కొలను, నాలుగు డ్రెస్సింగ్​ రూమ్​లు, 75 కార్పొరేట్​ బాక్స్​లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రత్యేకత ఎల్​ఈడీ దీపాలు. సాధారణంగా స్టేడియంలో ఉండే ఫ్లడ్​లైట్లు కాకుండా ఇక్కడ ఎల్​ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.

ఖర్చు

ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ. 800 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇందులో అత్యాధునిక డ్రెస్సింగ్​ రూమ్​లు, ఫుడ్​ కోర్ట్​లు, ప్రతి స్టాండ్​లోనూ ఆతిథ్య ప్రదేశాలు ఉన్నాయి. రెండు చిన్న క్రికెట్​ ప్రాక్టీస్​ మైదానాలు ఇక్కడ నెలకొన్నాయి. ప్రధాన మైదానానికి బయట ఇండోర్​ ప్రాక్టీస్​ పిచ్​లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో ఇక్కడ ప్రాక్టీస్​ చేసుకోవచ్చు. క్రికెట్​ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్​, టెన్నిస్ కోర్ట్​లు, స్క్వేష్​ అరెనా, టేబుల్​ టెన్నిస్​కు ప్రత్యేక ప్రదేశాలు, క్లబ్​హౌస్​ ఉన్నాయి.

అతిపెద్ద పార్కింగ్​

3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి.

ఇదీ చదవండి:'మొతేరా' అందాలకు క్రికెట్​ ప్రేమికులు ఫిదా

Last Updated : Feb 24, 2021, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details