గాయాలు తనకు మరింత ప్రేరణనిస్తాయని ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. తానిప్పుడు మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉన్నానని తెలిపాడు. ఈ నెల 19న చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆరంభ పోరుకోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.
"బంతిని చక్కగా బాదుతున్నాను. నేనిప్పుడున్న శారీరక, మానసిక పరిస్థితుల్లో లయ అందుకోవడం సులువైన పనే. ఆటకు ఎంతకాలం దూరమైనా ఫర్వాలేదు. నా పునరాగమనం విలువైందిగానే ఉంటుంది. ఆట కోసం నేను చాలా చక్కగా సన్నద్ధమయ్యాను. సానుకూలంగా ఉన్నాను. ఐపీఎల్‌ను నేనెంతో ఆస్వాదిస్తాను. ఘనంగా పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’.‘జీవితంలో గాయలెప్పుడూ మనతోనే ఉంటాయని గ్రహించాను. గాయపడాలని ఎవరూ కోరుకోరు. అయితే అలా జరగకుండా ఉండదన్నది సత్యం. గాయాలెప్పుడూ ఒకడుగు ముందుకేసుందుకే నాకు ప్రేరణనిస్తాయి. లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్ కోసం ఇబ్బందులేమీ పడలేదు. మా ఇంట్లో జిమ్ ఉండటంతో నేనూ, నా సోదరుడు రోజూ కసరత్తులు చేశాం. కోలుకున్న తర్వాత డీవై పాటిల్ ఆడటం అదృష్టం. జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయని అనిపిస్తోంది."