ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఆడనున్న టీమ్ఇండియా జట్టుపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. వృద్ధిమాన్ సాహాకు వికెట్ కీపర్‌గా ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి రెండో మ్యాచ్‌లో తప్పించడాన్ని తప్పుబట్టాడు. పంత్ ప్రదర్శన కూడా సరిగా లేకపోతే మళ్లీ సాహాను జట్టులోకి తీసుకుంటారా? అని జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.
"ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో సాహా.. కేవలం ఒకేఒక్క మ్యాచ్ ఆడాడు. అయితే తొలి మ్యాచ్‌లో అనుకున్నంతలో రాణించని కారణంగా అతడిని బాక్సింగ్ డే టెస్టుకు పక్కన పెట్టేశారు. సాహా స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ పంత్ కూడా రాబోయే మ్యాచ్‌లో సరిగా ఆడకపోతే.. అప్పుడు ఏం చేస్తారు? మూడో టెస్టులోనూ పంత్ సరైన ప్రదర్శన చేయకపోతే మళ్లీ సాహాను జట్టులోకి తీసుకుంటారా?"
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
సాహాను తప్పించి పంత్‌కు అవకాశం ఇవ్వడం పట్ల జట్టు యాజమాన్యం తీరు తనకు అర్థం కావడం లేదని గంభీర్ అన్నాడు. "సాహా స్థానంలో పంత్‌ను ఎంపిక చేయడం కరెక్ట్ కాదు. సిరీస్ కోసం వీరిద్దరిని ఎంపిక చేసుకుని, పరిస్థితులను బట్టి జట్టులో వికెట్ కీపర్ల మార్పు సరైనది కాదు. ఇలాంటి మార్పులు బౌలింగ్‌లో చేయొచ్చు. విదేశీ గడ్డపై సిరీస్‌ల కోసం జట్టులో కనీసం ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకోవడం సహజం. దాన్ని అర్థం చేసుకోగలం. కానీ, వృద్ధిమాన్ కేవలం స్వదేశంలోనే రాణించగలడని.. పంత్ విదేశాల్లో పనికొస్తాడనే విషయాన్ని అసలు నమ్మను. స్వదేశంలోనూ రాణిస్తే, విదేశాల్లో జరిగే సిరీస్‌ల్లోనూ కచ్చితంగా రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా ఏ ఆటగాడు చేయకపోతున్నాడనే వాదన అసంబద్ధం" అని గంభీర్ అన్నాడు.
ఇదీ చూడండి:గిల్, సిరాజ్ అరంగేట్రం.. రెండో టెస్టుకు జట్టిదే