అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత టీమ్‌ఇండియా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సిరీస్‌లో నిలవాలంటే రెండో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అభిప్రాయం అభిమానుల్లోనూ బలంగా వినిపిస్తోంది. అయితే, బాక్సింగ్‌డే టెస్టులో విజయం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాకు అంత తేలిక కాదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరమవ్వడం వల్ల పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో నాలుగు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అదే.. కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ జట్టులోకి రావడం. మరి ఈ నలుగురు ఇటీవల ఎలాంటి ప్రదర్శన చేశారనే విషయాలు చూద్దాం..
కోహ్లీ స్థానంలో రాహుల్..
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఏకైక ఆటగాడు కేఎల్ రాహుల్. సహజంగా మిడిల్‌ఆర్డర్‌లో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ కోహ్లీది. అయితే, ఇప్పుడతడు పితృత్వపు సెలవుల మీద భారత్‌కు తిరిగి వస్తున్న నేపథ్యంలో కెప్టెన్సీ రహానె చేపడుతున్నాడు. కానీ బ్యాట్స్‌మన్‌గా అతడి స్థానాన్ని భర్తీ చేయడంలో రాహుల్ ప్రధానంగా కనిపిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ఆడిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు ఫర్వాలేదనిపించాడు. రెండో వన్డేలో 76, తొలి రెండు టీ20ల్లో 80 పరుగులు చేశాడు. ఇక అంతకన్నా ముందు ఐపీఎల్లో 670 పరుగులు చేసి ఈ సీజన్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
సాహాకు బదులు పంత్..
ఇక టెస్టుల్లో నాణ్యమైన కీపర్‌గా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న వృద్ధిమాన్ సాహా తొలి టెస్టులో నిరాశపరిచాడు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అనుభవం కలిగిన ఆటగాడిగా జట్టు యాజమాన్యం అడిలైడ్ టెస్టుకు అతడిని ఎంపిక చేసింది. కాగా, రిషభ్ పంత్ (103 నాటౌట్; 73 బంతుల్లో, 9x4, 6x6) రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించినా అతడిని పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సాహాకు బదులు పంత్‌ను తీసుకునే వీలుంది. అతడు మిడిల్ ఆర్డర్‌లో ధాటిగా ఆడితే టీమ్‌ఇండియా వేగంగా పరుగులు చేయగలదనే అభిప్రాయం కూడా అభిమానుల్లో ఉంది. ఇక అంతకుముందు ఆడిన ఐపీఎల్లో ఈ యువ బ్యాట్స్‌మన్ 343 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.