విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్-భారత్ మధ్య జరగనున్న రెండో వన్డేకు జస్ప్రీత్ బుమ్రా వస్తున్నాడు. అయితే మైదానంలో ఆడేందుకు కాకుండా తోటి ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో ప్రాక్టీసుకు సిద్ధమవుతున్నాడు. వాళ్లకు బౌలింగ్ వేసి.. తన ఫామ్‌ను పరీక్షించుకోనున్నాడు.
డిసెంబర్ 15న చెన్నైలో భారత్-విండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. 18న విశాఖలో రెండో వన్డే , 22న మూడో వన్డే కటక్‌లో నిర్వహించనున్నారు.
ఇప్పటికే ప్రారంభం...
వెన్నుగాయంతో కొన్ని నెలలుగా విశ్రాంతిలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు ఫిట్నెస్ పెంచుకుంటున్నాడు. ఇటీవలే జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఆటకు సిద్ధమైతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2020 భారత జట్టులో ఇతడే బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు.