తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ ప్రపంచంలో 'రారాజు'గా కోహ్లీ.. 'చక్రవర్తి'గా గంగూలీ - రోహిత్​ శర్మ

క్రికెట్​ ప్రపంచంలో ఈ ఏడాది జరిగిన పెద్ద పండగ 'ప్రపంచకప్​-2019'. ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన విశ్వకప్​లో కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఆతిధ్య జట్టు కప్​ను సొంతం చేసుకుంది. ప్రపంచకప్​ మిగిల్చిన అనుభవాలతో ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

Indian-cricket-in-this-year
క్రికెట్​ ప్రపంచంలో 'రారాజు'గా కోహ్లీ.. 'చక్రవర్తి'గా గంగూలీ

By

Published : Dec 30, 2019, 9:35 PM IST

మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2019 అంతర్జాతీయ క్రికెట్‌లో మధురానుభూతులెన్నో అందించింది. ఉత్కంఠను రేకెత్తించింది. వివాదాలు చూపించింది. ఆనందంలో ముంచింది. ఇక భారత క్రికెట్‌ రంగంలో 'రారాజు'గా కోహ్లీ తన స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్‌ గంగూలీ క్రికెట్​ రాజ్యానికి మరో 'చక్రవర్తి'గా అవతరించాడు.

ఆశలు కనుమరుగయ్యాయి..
ఇంగ్లాండ్​ వేదికగా జరిగిన ప్రపంచకప్​లో ఈ ఏడాది రెండు దేశాలు చేదు అనుభవాన్ని చవిచూశాయి. భారత్‌, న్యూజిలాండ్‌ విశ్వకప్​లో చరమాంకం దాకా చేరి వెనుదిరగటం ఇరు దేశాల క్రికెట్​ అభిమానులకు మరచిపోని సంవత్సరం. సెమీస్‌లో ఐదు శతకాల రోహిత్‌ శర్మ, నిలకడకు మారుపేరైన విరాట్‌ కోహ్లీ, సొగసరి షాట్లకు చిరునామా కేఎల్‌ రాహుల్‌ కేవలం ఒక పరుగే చేసి షాకిచ్చారు. ఆపై భారం రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ మోశారు. గెలుపు ముంగిట బౌండరీ సరిహద్దు నుంచి కివీస్‌ ఆటగాడు గప్తిల్‌ విసిరిన బంతికి మహీ రనౌట్‌ కావడంతో భారతీయుల గుండెలు పగిలిపోయాయి. భారమైన మనసుతో కోహ్లీసేన ప్రపంచకప్‌ను ముగించింది.

ప్రపంచకప్​ సెమీస్​​లో ధోని రనౌట్​

కివీస్‌కు గుండెకోత
భారత్‌కు గుండె కోత మిగిలించిన న్యూజిలాండ్‌కు ఆతిథ్య ఇంగ్లాండ్‌ అంతకు మించిన వేదన కలిగించింది. అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఛేదనలో గప్తిల్‌ విసిరిన బంతి బెన్‌స్టోక్స్‌ బ్యాటుకు తగిలి బౌండరీకి చేరడంతో ఇంగ్లీష్‌ జట్టుకు 4 పరుగులు అదనంగా లభించాయి. ఫైనల్‌ మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో బౌండరీలు ఎక్కువ బాదిన మోర్గాన్‌ సేనను ఐసీసీ విజేతగా ప్రకటించింది. ఆ క్షణం కివీస్​ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.

క్రికెట్​ పుట్టినింటికి ప్రపంచకప్‌
క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌. లండన్‌లోని లార్డ్స్‌ మైదానాన్ని క్రికెట్‌ స్వస్థలంగా భావిస్తారు. ఆటను వారెంత ప్రేమించినా వన్డే ప్రపంచకప్‌ గెలవకపోవడం లోటుగా ఉండేది. 2015 ప్రపంచకప్‌లో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు 2019లో సరికొత్తగా వచ్చింది. డైరెక్టర్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ నిర్భయ క్రికెట్‌ను పరిచయం చేసి అభిమానులను అలరించారు. 400 పైచిలుకు లక్ష్యాలను ఛేదిస్తూ ఇంగ్లిష్‌ జట్టు అద్భుతాలు చేసింది. చివరికి ఎవరూ ఊహించని రీతిలో, ఉత్కంఠ రేకెత్తించిన ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.

విజయోత్సాహంలో ఇంగ్లాండ్​ జట్టు

గాడినపడ్డ కంగారూ
ఆస్ట్రేలియాకు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ ఎంతో కీలకం. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీరికి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. దాంతో ఆసీస్‌ క్రికెట్లో ఆత్మవిశ్వాసం లోపించింది. వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఆటగాళ్లు డీలా పడ్డారు. ఎక్కడికి వెళ్లినా ఓటములే వెక్కిరించాయి. 2019లో వారిద్దరూ పునరాగమనం చేయడంతో కంగారూకు కొండంత బలమొచ్చింది. ప్రపంచకప్‌లో గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌లో స్మిత్‌, లబుషేన్‌ అద్భుత పోరాటంతో ఆసీస్‌ తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

ప్రపంచకప్​లో సఫారీల వైఫల్యం
ఈ ఏడాది దక్షిణాఫ్రికా క్రికెట్‌ మరింత హీన స్థితికి చేరింది. ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శన అత్యంత ఘోరం. ఇంగ్లాండ్‌పై తప్పా మిగతా అన్ని మ్యాచుల్లో ఓడిపోయింది. ఏబీ డివిలియర్స్‌ పునరాగమనంపై వివాదం చెలరేగింది. దాంతో మిస్టర్‌ 360 బాధాతప్త హృదయంతో ఓ లేఖ రాశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌ ప్రక్షాళన మొదలైంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ పునర్‌ వైభవం దిశగా తొలి అడుగువేసింది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో అక్కడ జట్టు పర్యటించడం మానేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు పాక్‌తో సిరీస్​ ఆడారు.

సఫారీ జట్టు

క్రీడాకారుల తాత్కలిక విరామం
గతానికి భిన్నంగా ఈ సారి క్రికెటర్లు తమ మానసిక ఆరోగ్యంపై నిర్భయంగా పెదవి విప్పారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్‌ మానసిక ఆరోగ్య సమస్యలతో మూడు నెలలు నిరవధిక విరామం తీసుకున్నాడు. అతడికి క్రికెట్‌ ఆస్ట్రేలియా అండగా నిలిచింది. కోచ్‌లు, సహచరులు అభినందించారు. విరాట్‌ కోహ్లీ సైతం అతడిని ప్రశంసించాడు. 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు ఇక తన పనైపోయిందని భావించానని గుర్తు చేసుకున్నాడు. ఆసీస్‌లో మరికొందరు దేశవాళీ క్రికెటర్లు సైతం విరామం తీసుకున్నారు.

దాదా ది మహారాజా
గడ్డు కాలంలో జట్టు పగ్గాలు అందుకొని విజయవంతంగా ముందుకు నడిపించిన సౌరవ్‌ గంగూలీ అనూహ్యంగా బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో గులాబి బంతితో మ్యాచ్‌ను ఆడించి మార్పునకు బాటలు వేశారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ

కోహ్లీసేనకు మిశ్రమం
భారత్‌కు ఈ ఏడాది మిశ్రమ అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను వాటి సొంతదేశాల్లో చిత్తు చేసిన టీమిండియాను ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌ ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. నాలుగో స్థానంలో ఆటగాడిపై స్పష్టత రాలేదు. అంబటి రాయుడి వీడ్కోలు చర్చనీయాంశం అయింది. ఐసీసీ టోర్నీల్లో సెమీస్‌, ఫైనల్‌ గండం పరిష్కారాలు తెలియలేదు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ బృందంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. యువరాజ్‌సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ క్రికెట్​కు వీడ్కోలు పలికారు.

విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ

పరుగుల వరద
2019లో విరాట్‌, రోహిత్‌ పరుగుల వరద పారించారు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ 2,455 పరుగులు చేశాడు. రోహిత్‌ (2,442) కన్నా కేవలం 13 పరుగులే ఎక్కువ. హిట్‌మ్యాన్‌ ఈ ఏడాదిని రోహిత్‌ నామ సంవత్సరంగా మార్చేశాడు. టీమిండియా పేస్‌ దళం మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా మారింది. ఉమేశ్‌, షమి, ఇషాంత్‌ టెస్టుల్లో కనిష్ఠ సగటు (15.16)తో మొత్తం 81 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. టెస్టుల్లో భారత్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు మార్గాలు వెతుకుతున్నాయి. సెమీస్‌లో కివీస్‌ స్వింగ్‌ బౌలర్ల తరహాలో ఏం చేయాలా అని పరిశోధిస్తున్నాయి. 2020లో ఇదే టీమిండియాకు అతిపెద్ద సవాల్‌గా మారనుంది.

ఇదీ చదవండి:- విజ్డెన్​ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా

ABOUT THE AUTHOR

...view details