కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట రోహిత్-రాహుల్ జోడి అద్భుతమైన ఆరంభం ఇవ్వగా కోహ్లీ 85 పరుగులతో మెరిశాడు. చివర్లో జడేజా పని పూర్తి చేశాడు. ఫలితంగా ఈ ఏడాదిని గెలుపుతో ముగించింది కోహ్లీసేన. విండీస్‌పై 10వ సిరీస్ సొంతం చేసుకుంది.
మరోసారి శతక భాగస్వామ్యం
316 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్-రాహుల్ చూడముచ్చటగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మంచి బంతికి విలువనిస్తూ చెత్త బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో హోల్డర్ విండీస్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు. కుదురుకున్నట్లు కనిపించిన రోహిత్ (63)ను పెవిలియన్ చేర్చి కరీబియన్ శిబిరంలో ఆనందం నింపాడు. ఫలితంగా ఓపెనింగ్ వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కాసేపటికే రాహుల్(77)ను ఔట్ చేశాడు అల్జారీ జోసెఫ్. శ్రేయస్ అయ్యర్ (7), పంత్ (7), కేదార్ జాదవ్ (9) త్వరత్వరగా ఔటై టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించారు. మరో ఎండ్‌లో కోహ్లీ మాత్రం పట్టుదలగా ఆడుతూ పరుగులు సాధించాడు. విరాట్‌కు జడేజా మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో భారత్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ ఇన్నింగ్స్ 47 ఓవర్లో కోహ్లీ (85)ని ఔట్ చేసి గట్టి షాక్ ఇచ్చాడు కీమో పాల్. ఆఫ్‌సైడ్ వెళుతున్న బంతిని ఆడబోయి వికెట్‌ను సమర్పించున్నాడు విరాట్.
శార్దుల్ అదుర్స్....
అసలే టాప్ బ్యాట్స్మన్లు ఔటవడం వల్ల కష్టాల్లో పడిన భారత జట్టును అనూహ్యంగా నిలబెట్టాడు శార్దుల్ ఠాకూర్. కరీబియన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జడేజాకు తోడుగా ఉండి రెచ్చిపోయాడు. కాట్రెల్ వేసిన 48వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి టీమిండియా విజయాన్ని సునాయాసం చేశాడు. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోహ్లీసేన. జడేజా (39), శార్దూల్ (17) నాటౌట్‌గా నిలిచారు.
విండీస్ చివర్లో దంచికొట్టింది
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కచ్చితంగా నెగ్గాలన్న కసితో ఆడారు కరీబియన్లు. పూరన్, పొలార్డ్ అర్ధశతకాలతో రాణించారు. వీరి బ్యాటింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 రన్స్ సాధించింది విండీస్ జట్టు. ఆఖరి పది ఓవర్లలో 118 పరుగులు రావడం విశేషం.