వెస్టిండీస్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు భారత జట్టు మరో సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన.. 2-1 తేడాతో విజేతగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నువ్వా, నేనా అనే రీతిలో తలపడినా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. అయితే వన్డే ప్రపంచకప్ తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టును వాళ్ల దేశంలోనే వైట్‌వాష్ చేసింది. మరి దానికి కరీబియన్లు బదులిస్తారో... లేదంటే టీమిండియా చేతిలో చిత్తవుతారో త్వరలో తేలనుంది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. కోహ్లీసేన మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. విండీస్ జట్టు టీ20 పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
టాపార్డర్ ఫుల్ ఫామ్.. మయాంక్ చోటే అనుమానం
విండీస్‌తో టీ20 సిరీస్ గెలుపొందిన టీమిండియా... ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఇతడి వన్డే అరంగేట్రంపై సందేహం నెలకొంది. ఇందుకు కారణం ధావన్ లేని లోటును రాహుల్ భర్తీ చేస్తుండటమే.
ఒకవేళ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపిస్తే మయాంక్ అగర్వాల్ వన్డే అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే డగౌట్లో కూర్చోవాల్సిందే. వన్‌డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండడం వల్ల అతడినే ఆడిస్తారనే నమ్మకం ఉంది.
పంత్‌కు మరింత కీలకం...
ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న యువ బ్యాట్స్‌మన్, కీపర్ రిషభ్‌పంత్ అటు బ్యాటింగ్‌లో, ఇటు కీపింగ్‌లో విఫలమౌతున్నాడు. జట్టు యాజమాన్యం ఎన్ని అవకాశాలు ఇచ్చినా పేలవ షాట్లతో వికెట్ సమర్పించుకుంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి తొలి వన్డే మరో పరీక్షగా మారింది.