విశాఖ టెస్టులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఫలితం కోసం పోటీపడుతున్నాయి. సఫారీ జట్టుకు భారత్ 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 91 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా 67 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. 395 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది సఫారీ జట్టు. విజయానికి ఇంకా 384 రన్స్ చేయాల్సి ఉంది. క్రీజులో మర్కరమ్(3*), డి బ్రెయిన్ (5*) ఉన్నారు.
రోహిత్ మరో సెంచరీ..
భారత ఓపెనర్ రోహిత్‌శర్మ 127 పరుగులు (149 బంతులు; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో అదరగొట్టాడు. నయావాల్ ఛతేశ్వర్ పుజారా 81 పరుగులు (148 బంతులు; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఆఖర్లో జడేజా 40 రన్స్ (32 బంతులు; 3 సిక్సర్లు), కోహ్లీ 31 పరుగులు (25 బంతులు; 3 ఫోర్లు, సిక్సర్), అజింక్య రహానె 27 పరుగులు (17 బంతులు; 4 ఫోర్లు, సిక్సర్) దూకుడుగా ఆడారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 5 వికెట్లు(రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) తీసినా... 318 పరుగులిచ్చి నయా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులిచ్చిన మూడో బౌలర్‌గా రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/8తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. 431 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ను 502/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.