తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టులో ఓడితే కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు! - మహేంద్రసింగ్‌ ధోనీ

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. శనివారం రెండో పోరుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే వరుసగా 20 ఇన్నింగ్స్​ల్లో భారీ స్కోరు చేయలేకపోయిన భారత జట్టు సారథి కోహ్లీ.. ఇటీవల టెస్టుల్లో తొలి ర్యాంక్​ కోల్పోయాడు. తాజాగా రెండో టెస్టులోనూ ఓడిపోతే కెప్టెన్​గానూ ఓ చెత్త రికార్డు మూటగట్టుకోనున్నాడు.

virat kohli latest news
రెండో టెస్టులో ఓడితే కోహ్లీ రికార్డు పాయే

By

Published : Feb 27, 2020, 12:13 PM IST

Updated : Mar 2, 2020, 5:50 PM IST

క్రైస్ట్‌చర్చ్​ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తలపడనుంది టీమిండియా. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోరులో భారత జట్టు గెలవకపోతే టెస్టు సిరీస్​ కోల్పోనుంది. మరీ ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ గెలుపు ఎంతో అవసరం. విదేశాల్లో అత్యధిక టెస్టు ఓటములు అందుకున్న టీమిండియా కెప్టెన్ల జాబితాలో విరాట్​ రెండో స్థానానికి చేరనున్నాడు.

కోహ్లీ జట్టు బాధ్యతలు చేపట్టాక టీమిండియా.. విదేశాల్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడింది‌. అందులో 9 టెస్టులు ఓడిపోగా 4 మాత్రమే గెలిచింది. మిగతా రెండు డ్రా అయ్యాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన.. ఎప్పుడూ అన్ని టెస్టులు ఓడిపోలేదు. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచైనా గెలుపొందింది. తాజా కివీస్‌ పర్యటనలో రెండు టెస్టులే ఉండగా న్యూజిలాండ్‌ ఇప్పటికే తొలి మ్యాచ్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రెండో టెస్టులో గెలవకపోతే.. కోహ్లీ కెప్టెన్సీ ఖాతాలో అనవసరపు రికార్డు నమోదవుతుంది.

విరాట్​ కోహ్లీ

మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా విదేశాల్లో అత్యధికంగా 15 టెస్టులు ఓడిపోయింది. ఈ జాబితాలో మహీ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ చెరో 10 ఓటములతో రెండో స్థానంలో నిలిచారు. ఒకవేళ భారత్‌ క్రైస్ట్‌చర్చ్‌లో గనక ఓటమిపాలైతే.. గంగూలీని అధిగమించి విరాట్​... 11 ఓటములతో రెండో స్థానంలో కొనసాగుతాడు. అలా జరగకూడదంటే కోహ్లీసేన రెండో టెస్టులో తప్పక గెలవాల్సి ఉంది.

టీమిండియా కెప్టెన్‌ ప్రస్తుతం ఫామ్‌ లేక సతమతమవుతున్నాడు. గత 20 ఇన్నింగ్స్​ల్లో శతకం చేయని కోహ్లీ.. ఆఖరి ఇన్నింగ్స్​లో 21 పరుగులే చేశాడు. మరి రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. అలాగే మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా ఈ టెస్టులో పుంజుకోవాల్సిన అవసరముంది.

Last Updated : Mar 2, 2020, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details