ఆసీస్‌పై ఘన విజయంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. జట్టుకు వెన్నెముక అయిన విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు. సీనియర్ బౌలర్లూ జట్టులో చేరారు. సొంతగడ్డపై టెస్టు సిరీసు. ఇంకేముంది ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ గ్యారంటీ! అనుకున్నారు అభిమానులు. తీరాచూస్తే ఫలితం భిన్నంగా వచ్చింది. చెపాక్ టెస్టులో 420 పరుగుల లక్ష్యం ఛేదించలేక కోహ్లీసేన పరాజయం చవిచూసింది. 227 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇందుకు 5 కారణాలు కనిపిస్తున్నాయి.
టాస్‌తో మొదలు
సుదీర్ఘ ఫార్మాట్లో టాస్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందనడంలో సందేహం లేదు. అనేకసార్లు టాస్ గెలవడం కీలమవుతుంది. టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో ఆ అదృష్టం జో రూట్‌ను వరించింది. అందుకే మందకొడి పిచ్‌పై వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లకు సహకరించని పిచ్‌ను ఇంగ్లిష్ జట్టు ఆసరాగా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులు సాధించింది. టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా బంతి బ్యాటు మీదకు రావడం, లెంగ్తులు కుదరకపోవడంతో రూట్ ద్విశతకం బాదేశాడు. కోహ్లీసేన టాస్ గెలిచుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!
జీవం కోల్పోయిన పిచ్
టీమ్‌ఇండియా ఓటమికి మరో కారణం జీవం కోల్పోయిన పిచ్. బౌలింగ్ చేసేందుకు కనీసం అనువైన పరిస్థితులు ఉండాలని ఏ బౌలరైనా కోరుకుంటాడు. చెపాక్‌లో మాత్రం అలా కనిపించలేదు. పిచ్ అత్యంత ఫ్లాట్‌గా కనిపించింది. వైవిధ్యానికి ఆస్కారం లేకుండా పోయింది. తొలి రెండు రోజులు తారురోడ్డుపై బంతులు వేసినట్టుగా అనిపించిందని 300 వికెట్ల వీరుడు ఇషాంత్ శర్మ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. కొవిడ్ వల్ల బంతిపై ఉమ్మి రాసేందుకు వీల్లేకపోవడంతో స్వింగ్ రాబట్టేందుకు కష్టమైంది. ఇక ఆఖరి రెండు రోజులు పిచ్ మరోలా స్పందించింది. నాలుగో రోజు మధ్యాహ్నం నుంచి జీవం కోల్పోవడం మొదలైంది. విపరీతంగా టర్న్ అవ్వడం మొదలు పెట్టింది. అసహజ బౌన్స్ ఇందుకు తోడైంది.
జూనియర్ల బౌలింగ్
సీనియర్ బౌలర్లు బాగానే బంతులు వేసినా జూనియర్ల నుంచి సహకారం కరవైంది. పిచ్‌పై సహకారం లభించకున్నా ఇషాంత్, బుమ్రా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్తులో బంతులు విసిరేందుకే ప్రయత్నించారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దేశవాళీలో సుదీర్ఘ అనుభవం ఉన్న షాబాజ్ నదీమ్, కుర్రాడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోయారు. ఎక్కువ పరుగులు ఇవ్వడంతో ఇంగ్లిష్ బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో యాష్ 55 ఓవర్లు విసిరి 3 వికెట్లు తీసి 146 పరుగులిస్తే నదీమ్ 44 ఓవర్లు వేసి 167 పరుగులివ్వడం గమనార్హం. 2 వికెట్లు తీయడం సానుకూల అంశం. ఇక సుందర్ 26 ఓవర్లు విసిరి ఏకంగా 98 పరుగులు ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ కేవలం ఒక ఓవరే విసిరాడు. నదీమ్ 15 ఓవర్లు వేసి 66 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తర్వాతి టెస్టులో వీరికి చోటు కష్టమే!
జో రూట్ విధ్వంసం
కోహ్లీసేన ఓటమికి అసలైన కారణం జోరూట్. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. చెపాక్‌కు ముందు శ్రీలంకలో వరుసగా ద్విశతకం, శతకం బాదేశాడు. ఉపఖండంలో స్పిన్‌ను మంచినీళ్ల ప్రాయంగా భావించాడు. తొలి టెస్టులోనే అతడదే పని చేశాడు. వందో టెస్టు ఆడుతున్నానన్న ఒత్తిడే లేకుండా 218, 40 పరుగులు చేసేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ చేసిన 578 పరుగుల్లో 50% అతడివే కావడం గమనార్హం. ఫ్లాట్ పిచ్‌ను ఆసరాగా చేసుకొని అతడు విధ్వంసం చేశాడు. తొలుత ఆచితూచి ఆడుతూ క్రమంగా వేగం పెంచాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. అతడిని ఔట్ చేసేందుకు కోహ్లీ, యాష్ ఎన్ని ప్రణాళికలు వేసినా చేయాల్సిన పని చేసేశాడు. ఇక సారథిగానూ అండర్సన్, జాక్ లీచ్‌ను సమయోచితంగా ఉపయోగించి ఫలితాలు రాబట్టగలిగాడు.
కనిపించని కసి
విరాట్ అన్నట్టు ఆటగాళ్లలో కసి కనిపించకపోవడమూ ఒక కారణమే. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌లో ఇది స్పష్టం. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఎక్కువ పరుగులు చేయాల్సింది. అత్యంత కీలకమైన రోహిత్ శర్మ, అజింక్య రహానె రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమయ్యారు. మొదట కోహ్లీ ఆడకపోయినా రెండో ఇన్నింగ్స్‌లో పోరాడాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన చెతేశ్వర్ పుజారా ఛేదనలోనూ ఎక్కువసేపు ఉండాల్సింది. ఆఖరి రోజు అత్యంత కఠినంగా మారిన పిచ్‌పై అతడు ఓ మూడు గంటలు నిలిస్తే మిగతా వాళ్లకు ధైర్యంగా ఉండేది. కానీ ప్రతిసారీ అతడి నుంచే నిలకడ ఆశించడమూ సరికాదు. మైదానంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. తొలి ఇన్నింగ్స్ స్కోరు చూశాక ఒత్తిడికి లోనైనట్టు అనిపించింది.
ఇదీ చూడండి:తొలి టెస్ట్: ఇంగ్లాండ్ విజయం- సిరీస్‌లో 1-0 ఆధిక్యం