ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టు 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు షాద్మన్ ఇస్లామ్.. ఇషాంత్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి వికెట్ ఇషాంత్ శర్మకే దక్కడం విశేషం. ఆ తర్వాత మెహినుల్ హక్ తర్వాతి ఓవర్లో డకౌట్‌గా ఇషాంత్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అనంతరం మహ్మద్ మిథున్(6) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్ కైస్(5)ను ఇషాంత్ ఔట్ చేయడం వల్ల బంగ్లాదేశ్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో భారత బౌలర్ల జోరుకు కేవలం రెండు రోజుల్లోనే ఆట ముగుస్తుందని అంతా అనుకున్నారు.
అప్పుడు క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా(39)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే మధ్యలో కండరాల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు మహ్మదుల్లా. ఆ తర్వాత మెహిది హసన్(15), తైజుల్ ఇస్లాం(11) తక్కువకే ఔటయ్యారు. మరో ఎండ్‌లో ఉన్న ముష్ఫికర్ (59 బ్యాటింగ్; 70 బంతుల్లో, 12 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించి అజేయంగా క్రీజులో నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టెస్టు కెరీర్లో 21వ అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.