దిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో కాసేపట్లో ప్రారంభకానున్న భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కాలుష్య తీవ్రత అధికమవ్వడం వల్ల దిల్లీలో పొగమంచు కమ్ముకుంది. మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే మ్యాచ్‌పై తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని బీసీసీఐ ఉన్నతాధికారులు తెలిపారు.
" మ్యాచ్ ఇంకా రద్దు చేయలేదు. భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్‌పై తుదినిర్ణయం ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది ".
-- బీసీసీఐ అధికారులు
ప్లడ్‌లైట్ల వెలుగులో మైదానం స్పష్టంగానే కనిపిస్తున్నా... ఆటగాళ్లకు తెలుపు బంతి కనబడుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పొగమంచు కారణంగా దిల్లీ విమానశ్రయానికి రావాల్సిన 32 విమానాలను వేరే నగరాలకు దారి మళ్లించారు. ప్రస్తుతం దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరుకుంది. సాయంత్రం 6.30 తర్వాత మ్యాచ్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చు. భారత సారథి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడం వల్ల టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.