భారత్‌తో జరుగుతున్న మూడో టీ 20లో వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌లో కీరన్ పొలార్డ్(58), పావెల్(32) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, నవదీప్ సైనీ 2 వికెట్లతో రాణించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్(2) వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సైనికి క్యాచ్ ఇచ్చాడు నరైన్. అనంతరం కాసేపటికే లూయిస్(10), హిట్మైర్(1) వికెట్లు కోల్పోయింది విండీస్ జట్టు.14 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్.. నికోలస్ పూరన్(17) సాయంతో స్కోరు బోర్డు ముందుకు కదిలించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి. అనంతరం సైని బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.