రోహిత్ శర్మ చేసిన విలువైన సూచనల వల్లే తాను అద్భుత ఇన్నింగ్స్ ఆడానని వెల్లడించాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దు.. ఐపీఎల్లో లాగా స్వేచ్ఛగా నీదైనా శైలిలో బ్యాటింగ్ చేయమని రోహిత్ భాయ్ సలహా ఇచ్చాడని కిషన్ తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలని తపించిన ఇషాన్ కిషన్.. తన తొలి టీ20లోనే అర్థ సెంచరీ (56)తో అదరగొట్టాడు. భారత్ మ్యాచ్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి రెండో వికెట్కు 94 పరుగులు జోడించాడు.
"ఒక క్రికెటర్గా నా విజయానికి చాలా మంది సాయపడ్డారు. ఇంగ్లాండ్తో మ్యాచ్కు ముందు రోహిత్ భాయ్ నా దగ్గరకు వచ్చి పలు సలహాలు ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నావు.. ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దు.. ఐపీఎల్ తరహాలో నీ సహజ శైలిలో బ్యాటింగ్ చేయమని అతడు చెప్పాడు. టీమ్ఇండియా జెర్సీ ధరించినప్పుడు నీ వంతు పాత్ర పోషించాలని సూచించాడు."
-ఇషాన్ కిషన్, భారత యువ క్రికెటర్.