ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన భారత్ బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమవుతోంది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తమ అమ్ములపొదిలోని అస్త్రాలను సానపెడుతోంది. శుభ్‌మన్ గిల్, జడేజా తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఆటగాళ్లందరూ క్యాచ్‌ల ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్ రవిశాస్త్రితో కలిసి కెప్టెన్ రహానె కంగారూలకు చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
వార్మప్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న గిల్ బాక్సింగ్ డే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. నెట్స్‌లో గిల్ బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. అతడు దీటుగా బంతులను ఎదుర్కొంటున్నాడు.
అలాగే కంకషన్, తొడకండరాల గాయంతో తొలి టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. రెండో టెస్టుకు సన్నద్ధమవుతున్నాడని దానికి వ్యాఖ్య జత చేసింది. దీంతో జడ్డూ బరిలోకి దిగడం ఖరారైనట్లే. కాగా, రవిశాస్త్రి పర్యవేక్షణలో ఉమేశ్ యాదవ్, బుమ్రా బౌలింగ్ సాధన చేశారు.
తొలి టెస్టులో టీమ్ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ ఘోరపరాజయంతో పాటు కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై మిగిలిన టెస్టులకు దూరమవ్వడం.. టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నారంతా. అయితే గొప్పగా పుంజుకోవాలని భారత ఆటగాళ్లు కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో టెస్టులో గెలిచి ఆసీస్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేయాలని ఆశిస్తున్నారు. కాగా, నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు జరగనుంది.