దిల్లీ వేదికగా భారత్, బంగ్లా జట్ల మధ్య నేడు(ఆదివారం)తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. వాయు కాలుష్యంతో కాస్త ఇబ్బందులు ఉన్నా... ఆటను కొనసాగించేందుకు ఇరుజట్లు సిద్ధమౌతున్నాయి. దిల్లీలోని కోట్లా మైదానాన్ని అరుణ్‌జైట్లీ స్టేడియంగా మార్చాక తొలిసారి ఈ మ్యాచ్ జరగనుంది.
రికార్డు విజయాలు...
ఇప్పటివరకు బంగ్లాపై ఆడిన 8 టీ20 మ్యాచ్‌ల్లో అన్నింటా గెలుపొందింది భారత జట్టు. నేడు జరగనున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు రికార్డుకు మరింత చేరువకావాలని చూస్తోంది రోహిత్‌సేన.
దాయాది దేశం 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా తొలిస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాపై ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది భారత్. అయితే టీమిండియా వరుస విజయాలకు చెక్ పెట్టాలని బంగ్లా కూడా పట్టుదలగా ఉంది.
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు షకిబ్ అల్ హసన్ రెండేళ్ల పాటు ఆటకు దూరం కాగా, తమీమ్ ఇక్బాల్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఆ జట్టు కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. అయితే తొలి టీ20లో బంగ్లా జట్టు టీమిండియా లాంటి మేటి జట్టును ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది.
భారత జట్టు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది. ముంబయి ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసే అవకాశముంది. అలాగే రిషభ్ పంత్ కూడా బరిలోకి దిగనున్నాడు. దిల్లీ పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలం. ఫలితంగా యుజువేంద్ర చాహల్ జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ వెయ్యవ(1000) టీ20. ఈ చారిత్రక మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది మరింత ప్రత్యేకంగా మారింది.