భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే రాంచీలో జరగనుంది. సొంత స్టేడియంలో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
2013లో ఆసిస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌పై ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆ సమయంలో సొంత మైదానంలో ఇక ఆడడు అనే విషయం తెలియగానే అభిమానులు బాధపడ్డారు.
- స్టార్టింగ్ ప్రాబ్లమ్...
ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్ తుది జట్టులో ధావన్ రెగ్యులర్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. మెగా టోర్నీకి ముందు అతడు ఫామ్‌ను తిరిగిపొందాలని జట్టు భావిస్తోంది. గత పదిహేను వన్డేల్లో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రోహిత్ సైతం అనుకున్నంత ప్రదర్శన చేయకపోవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
బ్యాకప్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నాడు. ఒకవేళ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తే అంబటి రాయుడుకి ఉద్వాసన తప్పదు. ఆసీస్‌తో రెండు వన్డేల్లోనూ రాయుడు నిరాశపరిచాడు. రాహుల్ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.
రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ స్వల్ప తేడాతోనే గెలిచింది. మొదటి వన్డేలో ఆరు వికెట్లు, రెండో మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో విజయాలు సాధించింది.
'ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకావొచ్చు. మేము ముందుగానే వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటాం'
-టీమిండియా సారథి, కోహ్లీ
కేదార్, విజయ్ శంకర్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా గాయంతో జట్టులోకి వచ్చిన విజయ్ రెండో వన్డేలో ఆఖరి ఓవర్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. షమీ, బుమ్రా సైతం డెత్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. జడేజా ప్రపంచకప్‌లో తుది స్థానం సంపాందించేందుకు కష్టపడుతున్నాడు.
- నిలవాలంటే గెలవాల్సిందే...
కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ ఆసిస్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సి ఉంది. రెండు వన్డేల్లోనూ విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తోంది కంగారూ జట్టు.
రాంచీ స్టేడియం అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్‌కు వేదికైంది. పిచ్ బౌలర్లకు బాగా సహకరిస్తుంది. ఇక్కడ భారత్ నాలుగు వన్డేలు ఆడగా రెండింట విజయం సాధించింది. 2013లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జడేజా, షమి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, చాహల్, భువనేశ్వర్ కుమార్, రిషబ్ పంత్.
ఆసీస్:ఉస్మాన్ ఖవాజా, ఫించ్, షాన్ మార్ష్, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై, కమిన్స్, కల్టర్ నైల్, క్యారీ, నాథన్ లియోన్, బెహ్రెన్‌డార్ఫ్
- శుక్రవారం మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో...