టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించినా అభిమానుల్లో అంతగా సంతృప్తి లేదు. కారణం.. తొలి టెస్టులో భారత్ ఓటమి తర్వాత పిచ్‌లు పూర్తిగా స్పిన్‌కు దాసోహం అనేలా తయారయ్యాయి. దీన్ని ఎంతగా సమర్థించుకున్నా.. టీమ్ఇండియా విజయంలో పిచ్‌లు కీలకపాత్ర పోషించాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత జట్టు సత్తాకు అసలైన పరీక్షగా నిలిచింది టీ20 సిరీస్. పిచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని పొట్టి క్రికెట్లో.. ప్రపంచ మేటి టీ20 జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్ సాధించడం కోహ్లీసేన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఈ విజయానికి మించి.. ఈ సిరీస్‌లో భారత అభిమానులకు ఆనందాన్నిచ్చిన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న భారత్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చిన ఆ సానుకూలతలేంటో చూద్దాం.
కోహ్లీ కొత్త పాత్ర
కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మెరిశారు. హార్దిక్ పాండ్య మళ్లీ బౌలింగ్ చేశాడు, రాణించాడు. భువనేశ్వర్ తిరిగి లయ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇలా ఎన్నో సానుకూలాంశాలు! అయితే వాటన్నింటినీ మించి ఈ సిరీస్‌లో అందరినీ ఆకట్టుకున్నది విరాట్ కోహ్లి ఆట. చివరి టీ20లో ఓపెనర్‌గా వచ్చి కొత్త చర్చకు తావిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శిఖర్ ధావన్‌తో కలిసి చాలా ఏళ్లుగా ఓపెనింగ్ చేస్తూ వచ్చాడు రోహిత్ శర్మ. ఈ జోడీ వన్డేలు, టీ20ల్లో భారీగా పరుగులు సాధించింది. ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. కానీ రెండేళ్ల కిందటి నుంచి ధావన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. నిలకడ తప్పడం వల్ల అతడికి జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో కేఎల్ రాహుల్ చక్కటి ప్రదర్శనతో ఓపెనింగ్ స్థానంలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండగా.. రోహిత్‌కు జోడీగా రాహుల్ ఖరారైనట్లే కనిపించాడు. పంత్ విఫలమవుతున్న సమయంలో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా కూడా ఉపయోగించుకున్న టీమ్‌ఇండియా.. ఒక దశలో ప్రపంచకప్‌లోనూ అతడికే గ్లోవ్స్ బాధ్యత అప్పగించాలన్న ఆలోచన కూడా చేసింది. కానీ ఉన్నట్లుండి అతను ఫామ్ కోల్పోవడం జట్టును ఆందోళనలోకి నెట్టింది. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విఫలమై తుదిజట్టులో చోటు కోల్పోయాడు రాహుల్. దీంతో ఓపెనింగ్‌పై మళ్లీ సందిగ్ధత నెలకొంది.
కొత్త కుర్రాడు ఇషాన్ కిషన్ ఓ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసి ఆశలు రేకెత్తించాడు కానీ.. ప్రపంచకప్ సమీపిస్తుండగా అతణ్నే ఓపెనర్‌గా ఆడించే సాహసం భారత్ చేస్తుందా అన్నది సందేహమే. అయితే ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో ఓపెనర్‌గా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి కొత్త చర్చకు తావిచ్చాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. రోహిత్‌తో కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు భారీ ఆరంభాన్నిచ్చాడు. ఈ జోడీ విజయవంతం కావడం వల్ల కోహ్లీ ఓపెనర్‌గానే వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అభిమానుల్లో కలిగింది. పైగా టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌తో కలిసి తాను ఓపెనింగ్ చేయాలనుకుంటున్నట్లు కోహ్లి కూడా సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.