తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వార్​'నర్​-ఫించ్ శతకాలు.. వార్ వన్​సైడ్ - Ind vs Aus first odi

భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో కంగారూ జట్టు ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు ఫించ్-వార్నర్ అద్భుత శతకాలతో రాణించగా 10 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది.

match
మ్యాచ్

By

Published : Jan 14, 2020, 8:25 PM IST

Updated : Jan 14, 2020, 8:33 PM IST

ముంబయి వాంఖడే వేదికగా భారత్​తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఫించ్-వార్నర్ శతకాలతో మెరిశారు. ఫలితంగా 37.4 ఓవర్లలోనే మ్యాచ్​ను ముగించింది.

స్వదేశంలో పులులు ఏమయ్యారు..!

స్వదేశంలో వరుస విజయాలతో దూకుడు మీదుంది కోహ్లీసేన. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్​ను ఓడించి జోరుమీదుంది. ఇంకేంటి ఆస్ట్రేలియాను కూడా టీమిండియా మట్టికరిపిస్తుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్​ అయింది. స్వదేశంలో ఆసీస్​తో సిరీస్​ను పేలవంగా ప్రారంభించింది. కంగారూ జట్టుకు కనీస పోటీని ఇవ్వలేకపోయింది.

దంచికొట్టిన ఫించ్-వార్నర్

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. కొందరు మంచి టార్గెట్ అంటే మరికొంతమంది ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​కు ఇది లెక్కకాదని అన్నారు. అదే జరిగింది. ఈ లక్ష్యాన్ని కంగారూ జట్టు ఓపెనర్లే బాదేశారు. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచీ భారత బౌలర్లపై ఆధిపత్యం వహిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఉపఖండ పిచ్​లపై విదేశీ ఆటగాళ్లు రాణించడమే కష్టమంటే.. ఓపెనర్లిద్దరూ (ఫించ్-110, వార్నర్ -128) సెంచరీలు సాధించి ఈ లెక్కను మార్చారు. పరుగుల సునామీ సృష్టించారు. తొలి మ్యాచ్​ను ఎగరేసుకుపోయారు.

బుమ్రా, షమీకి ఏమైంది..!

టీమిండియా బౌలింగ్ బలంగా ఉందంటూ ఈ మధ్య అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా, షమీ జోడీని ఆకాశానికెత్తారు. కానీ వీరు ఈరోజు వేసిన బౌలింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వీరిద్దరితో పాటు మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. మన బౌలర్ల తీరు చూసుకుంటే బుమ్రా 7 ఓవర్లు 50 పరుగులు, షమీ 7.4 ఓవర్లు 58 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 5 ఓవర్లు 43 పరుగులు, కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు 55 పరుగులు, జడేజా 8 ఓవర్లు 41 పరుగులుగా ఉంది.

పడిలేస్తూ సాగిన భారత ఇన్నింగ్స్

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం ఫస్ట్​ డౌన్​లో వచ్చిన కేఎల్ రాహుల్​తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు శిఖర్ ధావన్. ఈ క్రమంలోనే ధావన్ తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.

30 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు

మూడు పరుగుల చేస్తే అర్ధసెంచరీ పూర్తవుతుందన్న దశలో కేఎల్ రాహుల్ (47) పెవిలియన్ చేరాడు. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి గబ్బర్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 16 పరుగులు చేశాక 156 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (16) ఆడమ్ జంపా బౌలింగ్​లో ఔటై నిరాశపరిచాడు. మరో 12 పరుగుల తేడాలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరి టీమిండియా శిబిరంలో ఆందోళన నింపాడు. ఫలితంగా 30 పరుగుల తేడాలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది కోహ్లీసేన.

జడేజా, పంత్ నిలిచారు

అనంతరం జడేజా, పంత్ వరుస వికెట్లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. కానీ భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. పంత్ 28, జడేజా 25 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వీరిద్దరూ ఆరో వికెట్​కు 49 పరుగులు జోడించారు. శార్దూల్ ఠాకూర్ (13), మహ్మద్ షమీ (10), కుల్దీప్ యాదవ్ (17) పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది.

కంగారూల కట్టుదిట్టమైన బౌలింగ్

మొదట్లో ధావన్, రాహుల్ శతక భాగస్వామ్యంతో ఆసీస్ బౌలింగ్ అంతగా ప్రభావం చూపించట్లేదని అనుకున్నారు అభిమానులు. కానీ త్వరగానే కోలుకున్న కంగారూ జట్టు టీమిండియా బ్యాట్స్​మన్​పై ఆధిపత్యం వహించింది. వరుసగా వికెట్లు తీసి భారీ స్కోర్​కు చెక్ పెట్టింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్​సన్ రెండు, ఆడమ్ జంపా, ఆష్టన్ టర్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Jan 14, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details