తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టులో భారత్​ చిత్తు.. కివీస్​దే సిరీస్​

భారత్​పై రెండో టెస్టులో గెలిచి సిరీస్​ కైవసం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్​ జట్టు. 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగానే ఛేదించింది కివీస్​. ఫలితంగా.. టెస్టు ఛాంపియన్​ షిప్​ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

IND NZ SERIES
సిరీస్​ కోల్పోయిన భారత్​

By

Published : Mar 2, 2020, 8:19 AM IST

Updated : Mar 3, 2020, 3:08 AM IST

విదేశీ గడ్డపై భారత్​ మరోసారి తేలిపోయింది. న్యూజిలాండ్​తో జరిగిన రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో వైట్​వాష్​కు గురైంది టీమిండియా. కోహ్లీ సేన విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే​ కోల్పోయి ఛేదించింది కివీస్​. ఓపెనర్లు టామ్​ బ్లండెల్(55), లాథమ్​(52) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిరువురూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తొలి వికెట్​కు 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

తొలుత లాథమ్ ఉమేశ్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. 5 పరుగులే చేసిన కెప్టెన్​ విలియమ్సన్​తో పాటు బ్లండెల్​ను పెవిలియన్​ పంపాడు బుమ్రా. అనంతరం.. టేలర్​(5), నికోల్స్​(5) లాంఛనాన్ని పూర్తి చేశారు. సిరీస్​ న్యూజిలాండ్​ వశమైంది. ఈ మ్యాచ్​ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.

వికెట్లు టపా టపా..

అంతకుముందు ఓవర్​నైట్​ స్కోరు 90/6 తో మూడోరోజు బ్యాటింగ్​​ కొనసాగించిన భారత్​ రెండో ఇన్నింగ్స్​ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 10 ఓవర్లలోపే కథ ముగిసింది. 124 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్​ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పుజారా(24) టాప్​ స్కోరర్​. ఇన్నింగ్స్​లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్​ట్రా(21)లదే కావడం గమనార్హం. జడేజా(16), కోహ్లీ(14), పృథ్వీ షా(14) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

కివీస్​ బౌలర్లలో బౌల్ట్​ 4, సౌథీ 3 వికెట్లతో చెలరేగారు.

భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 242 పరుగులు చేయగా.. కివీస్​ 235 పరుగులకు ఆలౌటైంది.

భారత్​కు తొలి సిరీస్​ ఓటమి..

కివీస్​ గడ్డపై తొలుత ఐదు మ్యాచ్​ల టీ-20 సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసిన భారత్​కు.. వన్డే, టెస్టు సిరీస్​ల్లో అదే ఫలితాన్ని రుచి చూపించింది విలియమ్సన్​ సేన. ఫలితంగా టెస్టు ఛాంపియన్​ షిప్​లో భారత్​కు తొలి సిరీస్​ ఓటమి ఎదురైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్​.

Last Updated : Mar 3, 2020, 3:08 AM IST

ABOUT THE AUTHOR

...view details