ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో తక్కువకే పరిమితమైంది టీమిండియా. ఓపెనర్ షెఫాలీ రాణించినా.. మిగతా బ్యాట్స్ఉమన్ నిరాశపర్చారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది భారత జట్టు.
ఆరంభంలోనే ఎదురుదెబ్బ...
కివీస్‌తో రసవత్తర పోరులో భారత అమ్మాయిలకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మృతి మంధాన, షెఫాలీ.. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి రెండు ఓవర్లలో రెండు ఫోర్లు బాదిన స్మృతి.. తాహుహు వేసిన మూడో ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. ఫలితంగా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరింది. భారత్ 17 రన్స్‌కే తొలి వికెట్ కోల్పోయింది.
షెఫాలీ దూకుడు...
రెండో ఓవర్లో రోజ్మేరీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన షెఫాలీ వర్మ.. తనదైన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు అక్కడ నాంది పలికింది. 3వ ఓవర్ ఆరో బంతికి అద్భుతమై బౌండరీ బాదిన షెఫాలీ.. అన్నే పీటర్సన్ వేసిన 4వ ఓవర్ 5, 6 బంతుల్లో కళ్లు చెదిరే సిక్సర్లు బాదింది. ఈ నేపథ్యంలో ఈ మెగాటోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రీడాకారిణిగానూ ఘనత సాధించింది.
స్మృతి ఔటయ్యాక వచ్చిన భాటియా... షెఫాలీతో కలిసి కీలక ఇన్నింగ్స్ నెలకొల్పింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే జట్టు స్కోరు 68 వద్ద ఔటైంది భాటియా.
హర్మన్ మరోసారి నిరాశ...
టీమిండియా సారథి హర్మన్ ప్రీత్ కౌర్.. టోర్నీలో మరోసారి విఫలమైంది. ఈ మ్యాచ్‌లోనూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. జెమీమా రోడ్రిగ్స్(10), వేదా(6), దీప్తి(8) నిరాశపర్చారు. సరైన సహకారం అందుకోలేకపోయిన షెఫాలీ(46) వద్ద ఔటైంది. ఆఖర్లో శిఖా పాండే(10), రాధా యాదవ్(14) కాస్త బ్యాట్ ఝుళిపించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కేర్, రోజ్ మేరీ తలో రెండు వికెట్లు సాధించారు. తుహుహు, డివైన్, కాస్పెరిక్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.