అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.
ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్ వాయిదా, ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచకప్ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాల్‌గా మారింది.
16 జట్లు క్వారంటైన్ కష్టం
కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. సెప్టెంబర్ వరకు సరిహద్దులు మూసేసింది. ఎవరు వెళ్లినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లు అక్కడికి వెళ్లి క్వారంటైన్‌లో ఉండటం కష్టం. అందులోనూ ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహణకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుకూలంగా లేదు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ప్రపంచకప్ నిర్వహిస్తే బాగుంటుందన్నది క్రికెట్ ఆస్ట్రేలియా అభిమతంగా తెలుస్తోంది. అలాగైతే ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021 జరగాలి. ఇది భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటనను సందిగ్ధంలోకి నెట్టేస్తుంది. ప్రత్యక్ష ప్రసారదారు ఇందుకు అంగీకరించకపోవచ్చు. భారత్‌లో 2021 ప్రపంచకప్, ఆసీస్‌లో 2022 ప్రపంచకప్ ఆతిథ్యానికి పరస్పరం అంగీకరించుకోవడం మరో అవకాశం. ఇప్పటికే ఆసీస్ పర్యటనకు బీసీసీఐ సహకరిస్తున్న నేపథ్యంలో ఇదీ కుదరకపోవచ్చు. మొత్తానికి వీటన్నిటిపై ఐసీసీ చర్చల్లో ఏం తేలుతుందన్నది ఆసక్తికరం. ఏదేమైనప్పటికీ ఇందులో బీసీసీఐ పాత్ర ప్రముఖంగా ఉండనుంది.
ఆస్ట్రేలియా 2021 ఫిబ్రవరి-మార్చి విండోకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ప్రపంచకప్ వాయిదా పడితే మాత్రం అక్టోబర్-నవంబర్ విండోలో ఐపీఎల్-2020 నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. టోర్నీకి విదేశీ ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ఛార్టర్ విమానాలు నడిపేందుకు బీసీసీఐ వెనుకాడకపోవచ్చు. అప్పటికి వైరస్ పరిస్థితిపై సంపూర్ణ అవగాహన వస్తుంది.
ఇదీ చూడండి.. గంగూలీకి తప్పని అంపన్ కష్టాలు