ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన స్కూప్ షాట్ ఆడాడు. మ్యాచ్ అనంతరం సరదాగా స్పందించిన టీమ్ఇండియా సారథి.. దీనిపై డివిలియర్స్ స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుంటానని చెప్పాడు.
ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో కోహ్లీ.. స్టంప్స్‌ను వదిలేసి స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ బాదాడు. అయితే.. ఇలాంటి షాట్స్ ఎక్కువగా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆడుతుంటాడు.
"బహుషా.. నేను ఆడిన ఆ షాట్లో ఏబీ డివిలియర్స్ కనిపించి ఉంటాడు. ఇలాంటి షాట్ ఆడుతానని అస్సలు ఊహించలేదు. హార్దిక్‌తో కూడా అదే చెప్పాను. టీమ్ఇండియా జట్టు ఆటగాళ్లు కూడా ఆ స్కూప్ షాట్ ఊహించి ఉండరు. ఈ షాట్ గురించి ఏబీకి ఈరోజే ఓ మెసేజ్ చేస్తా. తను ఎలా స్పందిస్తాడో చూడాలి! ".
-విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.