టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఛెతేశ్వర్ పుజారా ఐపీఎల్-14 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు కొన్ని ఐపీఎల్ మ్యాచులాడిన పుజారా అంతగా రాణించలేకపోయాడు. దీంతో అతణ్ని కొనుగోలు చేయడానికి గత కొన్నేళ్లుగా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. కానీ, 2021 ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ పుజారాను.. కనీస ధర రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుని ఐపీఎల్-14 సీజన్‌లో రాణించాలని అతడు కసిమీద ఉన్నాడు. ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మధ్యే ప్రాక్టీస్ సెషన్‌లో పుజారా సిక్సర్లు కొట్టిన వీడియోను చెన్నై జట్టు ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఇదీ చదవండి:మూగజీవాల సంరక్షణ కోసం కోహ్లీ సహాయం
"టీ20 క్రికెట్ ఆడేముందు మనలో మానసికంగా మార్పులు చేసుకోవాలి. అలా చేస్తే ఒత్తిడికి గురికావలసిన అవసరం ఉండదు. టెస్టు క్రికెట్‌లో ఎంతో విలువైన మన వికెట్‌ను కాపాడుకునే క్రమంలో చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, పొట్టి ఫార్మాట్‌లో మనకు ఇష్టమైన అన్ని రకాల షాట్లను ఆడుతూ మనల్ని మనం నిరూపించుకోవాలి. టీ20 ఫార్మాట్‌లో ఇప్పుడు నేను కూడా భాగం కావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆటగాళ్లు మారారు, వారి నిర్వర్తించాల్సిన బాధ్యతలు మారాయి. నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నేను పవర్ హిట్టర్‌ని కాదు. దానికి అంగీకరిస్తా. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పూర్తి పవర్ హిట్టర్స్ కాదు. అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌లో వారు అద్భుతంగా రాణిస్తున్నారు. వారిద్దరీ నుంచి టీ20ల్లో ఎలా ఆడాలో నేర్చుకుంటా" అని పుజారా తెలిపాడు.
ఇదీ చదవండి:సీనియర్లను కాదని.. పంత్‌కే కెప్టెన్సీ ఎందుకు?