టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి తాను గతంలో ఇచ్చిన సలహా వల్లే, ప్రస్తుతం స్టార్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడని చెప్పాడు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్. దీనితో పాటే విరాట్‌ను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.
"నేను కోహ్లీని 2008లో తొలిసారి కలిశాను. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, ప్రతిభ అతడి సొంతం. అయితే దానిని సరైన విధానంలో ఉపయోగించట్లేదని నాకు అనిపించింది. ఈ విషయమై ఇద్దరం చాలాసార్లు చర్చించుకునేవాళ్లం" -గ్యారీ కిర్‌స్టన్, భారత మాజీ కోచ్
2008లో భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌తో కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఈ సిరీస్‌లోని ఓ మ్యాచ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయిన సందర్భాన్ని గ్యారీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు విరాట్‌కు ఇచ్చిన సలహా వల్ల తర్వాతి వన్డేలో సెంచరీ చేశాడని చెప్పుకొచ్చాడు.
టీమ్ఇండియా, 2011 ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో కిర్‌స్టన్
"శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందులోని ఓ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, లాంగ్ ఆన్‌లో సిక్స్ కొట్టాలని ప్రయత్నించి ఔటయ్యాడు. 'నీ ఆటలోని స్థాయిని పెంచాలంటే బంతిని పైకి లేపకుండా కిందనుంచి కొట్టాలి. నువ్వు ఎన్నిసార్లు పైకి కొడితే అంత ప్రమాదంలో పడతావు' అని ఆ సమయంలో విరాట్‌కు చెప్పాను. దానిని అతడు పాటించడం వల్ల కోల్‌కతాలో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో శతకం సాధించాడు" -గ్యారీ కిర్‌స్టన్, భారత మాజీ కోచ్
కిర్‌స్టన్.. టీమ్ఇండియాకు 2008-11 మధ్య ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో భారత్ టెస్టుల్లో అగ్రస్థానం సాధించడం సహా వన్డే ప్రపంచకప్(2011)ను ముద్దాడింది. అనంతరం కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న గ్యారీ... దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌లోనూ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న బెంగళూరు జట్టుకు రెండేళ్ల పాటు కోచ్‌గా సేవలందించాడు.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ ఇవీ చదవండి: